Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా, ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ
నవతెలంగాణ-ముషీరాబాద్
బతుకమ్మ ఉత్సవం కాదు.. అదొక ఉద్యమం అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కార్యదర్శి హిమబిందు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఐద్వా, టీపీఎస్కే ఆధ్వర్యంలో వేర్వేరుగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. ఆధిపత్యాలు లేని సమానత్వ బతుకమ్మ వర్ధిల్లుమంటూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్లలను కించపరిచే పరిస్థితులు లేని సాంస్కృతిక భావజాలాన్ని ఈ సమాజంలో పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, అందరిపై ఉందని తెలిపారు. సమానత్వం సాధికారత మాటల్లో కాకుండా పాలకుల విధానం కావాలనీ, ఆచరణలో అమలు చేయాలని కోరారు. పూలతో పూజించడమంటే.. ప్రకృతిని ఆరాధించడమనీ, సమైక్య జీవన విధానాన్ని చూపించడమని అన్నారు. మనిషికీ ప్రకృతికీ మధ్య ఉన్న సంబంధం చాటిచెప్పడమే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని రూపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళా శక్తిని చాటే నినాదాలతో రూపొందించిన ప్లకార్డులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, లక్ష్మి, నాయకులు ఆశాలత, హైమావతి, స్వర్ణ, సలీమా, సుజావతి, కష్ణకుమారి, శైలజ, లావణ్య, గంగా, పింకీ తదితరులు పాల్గొన్నారు.