Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమల్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఆహార కొరత, పౌష్టికాహార లోపం వల్ల జరిగే మరణాలను అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ బియ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్లతో పాటు నాలుగు విడతలుగా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమలరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఆహార భద్రత చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో తిరుమలరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 19 కోట్ల మంది ఆకలి, పౌష్టికాహార లోపంతో అలమటిస్తున్నారనీ, ఇలాంటి వారికి మంచి పౌష్టికాహారం కల్పించాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమని తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అందించే సదుపాయాలు సక్రమంగా అమలయ్యేలా చూడటానికి జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులుండేలా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో కొత్తగా 7488 రేషన్ కార్డులు మంజూరు చేశామనీ, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అధికారుల అనుమతులతో మంజూరవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలపై స్పందించారు. పాఠశాలలకు నాణ్యత లేని బియ్యం సరఫరా చేసినట్లయితే, వాటిని వెంటనే మార్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండటానికి ఎవరూ ముందుకు రావడం లేదనీ, రేషన్ బియ్యం కోసం సుదూరం ప్రయాణం చేసి తీసుకెళ్లడానికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారనీ ప్రజా ప్రతినిధులు తెలుపగా.. ఇలాంటివి స్థానికంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు చైర్మెన్ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, కృష్ణన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, విద్యా శాఖ అధికారి రేణుకదేవి, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, వైద్య శాఖ అధికారి తుకారం, జడ్పీ వైస్ చైర్మెన్ విజయకుమార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.