Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీఏ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం తగదని పలు సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ అయిన విద్యార్థులకు ఆ క్లాసులు జరుగుతుండగానే, మధ్యలో ఫస్టియర్ పరీక్షలు ఏంటని ఆక్షేపించాయి. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలి' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆ సంఘం అధ్యక్షులు నాగటి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ ఎమ్ రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్ జంగయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె సురేష్‌కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జావీద్, హైదరాబాద్ అధ్యక్షులు అశోక్, తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐనేని సంతోష్‌కుమార్, హైదరాబాద్ జిందాబాద్ కార్యదర్శి వీరయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కె శ్రీనివాస్, తిరుమల్లేష్, కొప్పిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు చెందిన గురుకుల విద్యాలయాల్ని ఇప్పటికీ ఓపెన్ చేయలేదనీ, అక్కడ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాయగలుగుతారని ప్రశ్నించారు. ఆన్లైన్ తరగతులకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు..ఎంతమందికి అర్థమయ్యాయో స్పష్టత లేదన్నారు. ఆన్లైన్ క్లాసుల సమయంలో ప్రభుత్వ గెస్ట్ లెక్చరర్లకు అనుమతి ఇవ్వలేదనీ, ఆయా సబ్జెక్టుల టీచర్లు పాఠాలు బోధించకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్‌బోర్డు పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.64 కోట్లను వసూలు చేసిందనీ, తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం తరహాలో ఇంటర్ నిధుల్ని కూడా స్వాహా చేసేందుకే ఫస్టియర్ పరీక్షల డ్రామాకు కొందరు అధికారులు తెరలేపారని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళంలో పడ్డారని చెప్పారు. ఈ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనీ, లేనిపక్షంలో కోర్టులో సవాలు చేస్తామనీ హెచ్చరించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలనే తీర్మానాన్ని రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని ప్రభుత్వానికి పంపుతామని టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ చెప్పారు.