Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను ప్రజలకు తెలపాలి
- తెలంగాణ పోరాటంలో కళాకారుల పాత్ర మరువలేనిది
- ఒగ్గుకథ కళాకారులకు పింఛన్, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
- గుర్తింపు కార్డులు, వాయిద్య పరికరాలపై సబ్సిడీ, ప్రమాదబీమా కల్పించాలి
- ఒగ్గుకథ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహాసభలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల బాధలు, కష్టాలను కథలుగా అల్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనీ, ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒగ్గుకథ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహాసభలు ఆ సంఘం అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. ఒగ్గుకథ జానపద కళాకారులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఒగ్గు కళాకారుల సమస్యల పరిష్కారానికి అంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. పేదలకు సంఘాలు ఎక్కువగా అవసరమనీ, తమ సమస్యల పరిష్కారం, అవకాశాలను రాబట్టుకునేందుకు సంఘంతో పాటు వారి మధ్య ఐక్యత ముఖ్యమని తెలిపారు. ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ రూ.100 పైగా పెరిగిందనీ, రోజూ 20 నుంచి 30 పైసలు పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఈ రూపేనా రూ.6లక్షల కోట్ల పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పోతే.. మనకు బిక్షం వేసినట్టు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మాత్రం దీన్ని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏ ఉద్యమంలోనైనా కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు. నైజం రాజుకు వ్యతిరేకంగా ఆ కాలంలో చేసిన పోరాటంలో ఆటలు, పాటల సాంస్కృతిక కళాకారుల పాత్ర చాలా గొప్పదని గుర్తుచేశారు. ఆటలు, పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసి.. పెద్దఎత్తున పోరాటంలో పాల్గొనేలా కృషి చేశారన్నారు. అలా ప్రజలను చైతన్యవంతం చేసే చేసే పాత్రను నిర్వహిస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్పే సంఘంగా అభివృద్ధి కావాలని సూచించారు. అనంతరం మత్స్యకారుల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.బాలకృష్ణ, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం.వీ రమణ, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒగ్గుకథ జానపద కళాకారులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఒగ్గుకథ కళాకారులకు పింఛన్, డబుల్ ఇండ్లు, గుర్తింపు కార్డు, బస్సు పాసు, ప్రమాదాల్లో చనిపోయిన వారికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ, భవన కార్మికుల మాదిరిగా ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటివి కల్పించాలని డిమాండ్ చేశారు. జానపద కళాకారులు కళలు నమ్ముకుని బతుకున్నారని, అమ్ముకోని కాదన్నారు. సర్వాయి పాపన్న, బీరప్ప వంటి చరిత్ర పుస్తకాల్లో లేదనీ, వీటి రూపంలోనే మనందరికీ తెలిసిందన్నారు. భవిష్యత్తు పోరాటాలకు అండగా ఉంటామనీ, ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కారించుకుందామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఎల్లమ్మ, మల్లన్న, బీరప్ప ఒగ్గుకథలు సభను ఆకట్టుకున్నాయి. అనంతరం 30 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లం పరమేష్, జంటనగరాల అధ్యక్షులు పెంబర్తి నరహరి, సంఘం సీనియర్ నాయకులు గట్ల మల్లయ్య, గొరిగే సత్యనారాయణ, చిందం నగేష్, తరాల బాబు, రాసాల క్రిష్ణ, కోడూరి క్రిష్ణ, కౌడే ఆశోక్, రాగుల సారయ్య, ఇరుమల్ల నర్సింహ్మాలు, కుండే సాంబయ్య, నాగులపల్లి శ్రీశైలం, దాసరి బాలరాజు, మక్కే శ్రీకాంత్, కర్నె దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.