Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్‌డీకి 'పట్నం' విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని 'పట్నం' ప్రతినిధి బృందం టీఎస్ఆర్టీసీ చైర్మెన్ వీసీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, రాష్ట్ర నాయకులు డీఏఎస్‌వీ ప్రసాద్, కేవీఎస్ఎస్ రాజు, ఎమ్డీ అబ్బాస్ శుక్రవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. నగరంలో 2020 జనవరి నుంచి 800 బస్సుల్ని తగ్గించారనీ, వాటిలో 250 సబర్బన్, 150 ఆర్డినరీ బస్సులు ఉన్నాయని తెలిపారు. 18 నెలలుగా కరోనా వల్ల ప్రజలకు ఆ ఇబ్బందులు తెలియలేదన్నారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొని, స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు సహా అన్నీ తిరిగి ప్రారంభమవుతున్నాయని చెప్పారు. నగరం విస్తరిస్తున్నందున ప్రజా రవాణా సౌకర్యాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో 2,300 గ్రామాలకు బస్సులు వెళ్లట్లేదనీ, కనీసం ఒకటి లేదా రెండు ట్రిప్పులు ఆయా గ్రామాలకు బస్సులు తిప్పాలని విజ్ఞప్తి చేశారు. సంస్థపై డీజిల్ భారం ఉన్నదనీ, పన్నులను మినహాయించి, ప్రజలకు ఇస్తున్న బస్‌పాస్ రాయితీలను ప్రభుత్వం చెల్లిస్తే, ప్రజలపై భారం వేయాల్సిన అవసరం లేదని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో రద్దు అయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. తమ విజ్ఞప్తిపై ఎమ్డీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారనీ, అందరి అభిప్రాయాలు తీసుకొని ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారని వారు తెలిపారు.