Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు సీఐటీయూ నేతల సూటి ప్రశ్న
- మల్లారెడ్డి.. యాజమాన్యాల శాఖకు మంత్రంటూ విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వేలాది మంది శ్రామిక మహిళలకు కనీస వేతనాల జీవోలను విడుదల చేయని ముఖ్యమంత్రి కేసీఆర్కు... బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపే అర్హత ఉందా..? అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.సాయిబాబు సూటిగా ప్రశ్నించారు. మహిళలందరూ ఆత్మాభిమానంతో, ఆనందంగా, హాయిగా బతకాలనే ఉద్దేశంతో 'బతుకమ్మ...' పండుగను జరపుకోవటం రాష్ట్రంలో ఆనవాయితీ అని తెలిపారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోని శ్రామిక మహిళలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలను సవరించాలనీ, ప్రభుత్వం విడుదల చేసిన ఐదు జీవోలను గెజిట్ చేయాలనీ, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్లపై శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్త సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని కార్మికశాఖ కమిషనరేట్ వద్ద సీఐటీయూ నగర అధ్యక్షుడు కె.ఈశ్వరరావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎమ్.వెంకటేశ్, నాయకులు ఆర్.వాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు. సాయిబాబు మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డి వాస్తవానికి కార్మికశాఖ అయినా, ఆయన యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమాధిపతులకు ఊడిగం చేస్తున్న కార్మికశాఖ అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలనీ, లేదంటే ఆ శాఖ ఆఫీసులకు 'యాజమాన్యాల శాఖ' అనే బోర్డులు తగిలిస్తామంటూ హెచ్చరించారు. ఈశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయిగాని కాంట్రాక్టు కార్మికులు, శ్రామికుల వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి గోస ప్రభుత్వానికి పట్టదా..? అని ప్రశ్నించారు. ఈ అంశంలో సర్కారు తన తీరును మార్చుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సాయిబాబు మాట్లాడుతున్న సమయంలో బీఎమ్ఎస్ అనుబంధ 'బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్' నాయకులు, కార్యకర్తలు కమిషనరేట్ ప్రాంగణంలోకి ప్రదర్శనగా వచ్చారు. 'భారత్ మాతాకీ జై...' 'కార్మికుల ఐక్యత వర్థిల్లాలి...' అంటూ వారు పెద్ద పెట్టున నినదించారు. ఈ సమయంలో సాయిబాబు కొనసాగిస్తూ... 'మోడీ సర్కారు తీసుకొస్తున్న లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి వ్యతిరేకంగా సీఐటీయూ ఎర్రజెండా, టీఆర్ఎస్కేవీ గులాబీ జెండా, బీఎమ్ఎస్ కాషాయజెండాతోపాటు ఇతర కార్మిక సంఘాల జెండాలన్నీ కలిసి పోరాడాల్సిన అవసముంది... ఇక్కడ జెండాలు కాదు ముఖ్యం, కార్మికుల హక్కులు ముఖ్యం...' అని సూచించారు.
కార్మికుల ఆగ్రహానికి ప్రతిరూపం సమ్మె... చుక్క రాములు, సాయిబాబు
సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె... కనీస వేతనాలపై కార్మికుల ఆగ్రహానికి ప్రతిరూపమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎమ్.సాయిబాబు పేర్కొన్నారు. తసమ్మెను జయప్రదం చేసిన కార్మికులందరికీ వారు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘాలు, వాటి అనుబంధాలతో నిమిత్తం లేకుండా సమ్మెకు అపూర్వ స్పందన లభించిందని వివరించారు. కనీస వేతనాల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనంటూ అది ప్రకటించిందని తెలిపారు.