Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిసిన మాటల ముచ్చట
- అసెంబ్లీ నిరవధిక వాయిదా
- స్వోత్కర్ష, పథకాల ప్రచారానికే ప్రాధాన్యత
- పరిమితంగా ప్రజాసమస్యలపై చర్చ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. వారం రోజుల వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ అసంపూర్తిగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేనట్టు రెండు వారాల్లో రెండుసార్లు పది రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, హౌంమంత్రి అమిత్‌షాతో అధికారికంగా కాకుండా రాజకీయంగా ఏం మాట్లాడి వచ్చారనే విషయాలు మాత్రం గోప్యంగానే ఉన్నాయి. సీఎం ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కనిపించింది. 'లేస్తే మనిషిని కాను' అని హూంకరించి, కేంద్రం పెద్దమనసుతో అర్థం చేసుకోవాలనే విన్నపాలతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పోడు భూముల సమస్యపై చర్చ జరిగిందే తప్ప పరిష్కారం లభించలేదు. ఢిల్లీకి అఖిలపక్షం అన్నారే తప్ప, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో జాతీయ రైతు సంఘాలు చేపట్టిన భారత్‌బంద్‌లో టీఆర్ఎస్ భాగస్వామ్యం కాలేదు. ఆరోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండిపోయి, బంద్ ముగిసిన తెల్లారి హైదరాబాద్‌కు వచ్చారు. వారంరోజుల్లో 37 గంటల ఐదు నిముషాలు జరిగిన సభలో ఏడు బిల్లులకు ఆమోదం లభించింది. ఆరు అంశాలపై లఘుచర్చ జరిగింది. 27 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. శాసనసభ చర్చల్లో సభ్యులు పెద్దగా సీరియస్‌గా పాల్గొన్నట్టు కనిపించలేదు. ఒక్కోరోజు సభలో పట్టుమని 30 మంది సభ్యులు కూడా లేకుండా నడిచింది. హుజూరాబాద్ ఎన్నికనేది చాలా చిన్న ఉప ఎన్నిక అని సీఎం కేసీఆర్ సభలో వ్యాఖ్యానించినా,దళితబంధును ప్రచారానికి పూర్తిస్థాయిలో వాడుకున్నారు. ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందో లేదో కానీ, చివరి అస్త్రంగా జనాభా లెక్కల్లో బీసీ కులాల జనగణన చేపట్టాలంటూ తీర్మానం చేసి, సభ ఆమోదం తీసుకున్నారు.అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రంపై కన్నెర్ర చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,దానికి కార్యాచరణను మాత్రం ప్రకటిం చలేదు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం లాగేసుకుంటుందనీ, అదనంగా ఒక్క రూపాయి కూడా రాల్చలేదనీ, అసలు ఇవ్వాల్సిన నిధులకే దిక్కూదివానం లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతులకు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న 'ఫసల్‌బీమా' ఉత్తిదేనని తేల్చిచెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలను పోషించేందుకే ఈ స్కీం ఉన్నదనే కఠినమైన మాటలూ మాట్లాడారు. ప్రతి శాసనసభ సమావేశాల్లో మాదిరే ఈ సారి కూడా 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు 'త్వరలో' భర్తీ చేస్తామన్నారు. స్టాంపు డ్యూటీ సవరణ చట్టం చేసి, నొప్పి తెలీకుండా ప్రజలపై అదనపు ఆర్థికభారం మోపారు. 2003 విద్యుత్‌చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తితో ఏర్పాటైన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి మూడేండ్లుగా కరెంటు లెక్కలు ఇవ్వకుండా, సభలో మాత్రం గణాంకాలను ఆశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పల్లె, పట్టణ ప్రగతి అమలుపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సభలో మాట్లాడారు. ఆ తర్వాత అదే అంశంపై సీఎం కేసీఆర్ కూడా సుదీర్ఘంగా మాట్లాడి, తాము చాలా అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. శాసనమండలిలో మంత్రి కేటీఆర్ 'సీఐటీయూ'కి పనిలేకుండా చేశామని కామెంట్ చేసిన తెల్లారి, అదే సీఐటీయూ అండతో ఎర్రజెండా చేబూని మున్సిపల్, గ్రామపంచా యతీ కార్మికులు, బిల్డింగ్ నిర్మాణ కార్మికులు 'చలో అసెంబ్లీ' అంటూ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించారు. సభలో ఆశించిన స్థాయిలో సమస్యలపై చర్చ జరగలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే, సభ నుంచి సస్పెండ్ చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రజాసమస్యలను ప్రస్తావించి వదిలేశాయి. వాకౌట్లు, వివాదాలు, పరస్పర ఆరోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు, సస్పెన్షన్లు వంటి సన్నివేశాలు ఏవీ లేకుండా సభ ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తమకూ టీఆర్ఎస్కు మధ్య ఉన్న బంధాన్ని అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండుపార్టీలు తమ మధ్య ఎలాంటి పొత్తు లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకంటే మరింత స్వామిభక్తి ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని ఆయన ఆకాశానికెత్తడం చర్చనీయాంశమైంది.