Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతున్న మోడీ
- కార్పొరేట్ల సేవలో బీజేపీ
- జూలైలో శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభ
- సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నదనీ, దాన్నుంచి నుంచిబయట పడతామన్న ఆశలు అడుగంటుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ అన్నారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అమ్మనీయబోమంటూ గతంలో చెప్పటం ద్వారా అధికారంలోకి వచ్చిన మోడీ..ఇప్పుడు దేశాన్ని తెగనమ్మేందుకు తహతహలాడుతున్నదని విమర్శించారు. మానిటైజేషన్ విధానంతో రైల్వే, రోడ్లు, పెట్రోలియం వంటి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ప్రభుత్వం కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా సుమారు రూ.6లక్షల కోట్లు సమీకరిస్తున్నదని వివరించారు. స్వదేశీ భక్తులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థతోపాటు శాంతి భద్రతలు కూడా కుదేలయ్యాయని చెప్పారు. గత రెండేండ్ల కాలంలో 12.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని వివరించారు. ఆదానీ, అంబానీలే బాగుపడుతున్నారనీ, అదానీ కుటుంబం రోజుకు వెయ్యికోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడేళ్లలో మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారనీ, దీంతో 2024 లో కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశీశ్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అతడికి నేర చరిత్ర ఉన్నదని తెలిపారు.
వచ్చే ఏడాది జూలై నెలాఖరులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ లోగా గ్రామ, పట్టణ, జిల్లా మహాసభలు నిర్వహిస్తామనీ, రాష్ట్ర మహాసభ అనంతరం అక్టోబర్ 14-17 తేదీల్లో విజయవాడలో జాతీయ మహాసభ జరుగుతుందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటూ తానేప్పుడూ అనలేదని సీఎం కెేసీఆర్ నిండు శాసనసభలో చెప్పడాన్ని తప్పుబట్టారు. 2014 టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని పేజీ నెంబర్ 15,16లో దళితులతో పాటు ఎస్టీలకు కూడా మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ మాటలన్నీ నీటి మూటలేనా? అని ప్రశ్నించారు. ఈనెల 11న లఖీంపూర్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గురు, శుక్రవారాల్లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితీ సమావేశాల్లో పలు తీర్మానాలు చేసినట్టు వెల్లడించారు.