Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామినేషన్ పత్రాలు అందజేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు
- హరీశ్ రావు, ఈటల తోడు దొంగలే : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- నామినేషన్ల దాఖలు చేసేందుకు భారీగా వచ్చిన ఫీల్డ్అసిస్టెంట్లు
- కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకున్న పోలీసులు
- 11న నామినేషన్ పత్రాల పరిశీలన.. 13 వరకు ఉపసంహరణ గడువు
- 30న పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ
ప్రతినిధి / హుజూరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల గడువు శుక్రవారం చివరి రోజుకావడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు సహా స్వతంత్రులు పెద్దఎత్తునే వచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చివరి రోజునా తమ నామినేషన్ పత్రాలతో భారీ సంఖ్యలోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల పేరుతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మంత్రి హరీశ్‌రావుతో కలిసి మరోమారు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. అంతకుముందే తన భార్య జమునతో రెండుమార్లు నామినేషన్ పత్రాలు వేయించినా ఆయన మరోమారు తన భార్యతో శుక్రవారమూ మరో సెట్ నామినేషన్ వేయించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావు సైతం తమపార్టీ సీనియర్ నాయకులు పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి నామినేషన్ వేశారు.
తొలుత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి రాగా.. ఆ ప్రాంతమంతా ఆయాపార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. అప్పుడు కొవిడ్ నిబంధనలను పక్కనబెట్టిన పోలీసులు భద్రతా ఏర్పాట్లుమాత్రమే చూశారు. మరోవైపు నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే పోలీసులు భారీ బందోబస్తుగా నిలబడ్డారు. పత్రాలు సరిగా ఉండి రెండవ డోసు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న అభ్యర్థులను మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతిచ్చారు. అభ్యర్థులను ప్రతిపాదిస్తున్న వ్యక్తులూ రెండవ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకుని ఉండాలని ఆంక్షలు పెట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు.
టీఆర్ఎస్ అభ్యర్థిని అడ్డుకోబోయిన 'ఫీల్డ్' సిబ్బంది
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను నామినేషన్లు వేయకుండా కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆర్డీఓ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, వెంట ఉన్న మంత్రి హరీశ్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. అక్కడే ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హరీశ్‌రావు, ఈటల తోడు దొంగలే
కేసీఆర్, ఈటల వద్ద ఉన్నంత డబ్బు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర లేవు. అటు మంత్రి హరీశ్‌రావు, ఇటు ఈటల రాజేందర్ ఇద్దరూ తోడు దొంగలే' అంటూ టీపీసీసీ చైర్మెన్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ అనంతరం ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఆయన అటు టీఆర్ఎస్పార్టీపైనా, బీజేపీపైనా విమర్శలు చేశారు. మరోవైపు పార్టీ నమ్మి టికెట్ ఇస్తే పాడి కౌశిక్‌రెడ్డి వమ్ము చేశాడంటూ ఆయన్ను పాకిస్తాన్ కసబ్‌తో పోల్చారు. ప్రజాసమస్యలను పక్కబెట్టిన ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ వారి ఆస్తులు కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారని అన్నారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్.. ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ధర్నాల్లో పాల్గొన్నప్పుడు తనపై 24 కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి