Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతని కొడుకును వెంటనే అరెస్టు చేయాలి
- విజయాన్ని చేరేంత వరకు విశ్రమించేది లేదు
- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ స్థాయిలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం తీర్మానించింది. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయం అజోరు భవన్ లో శుక్రవారం ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ), భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా అగ్రికల్చర్ అండ్ రూరల్ లేబర్ అసోసియేన్ (ఏఐఏఆర్ ఎల్ఏ), ఆల్ ఇండియా సంయుక్త్ కిసాన్ సభ (ఏఐఎస్ కెఎస్), ఆల్ ఇండియా అగ్రగామి క్రిష్ శ్రామిక్ యూనియన్ (ఏఐఏకెఎస్ యూ) నాయకుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బి.వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ), గుల్జార్ సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఏఐఎస్ కెఎస్), ధీరేందర్ ఝా (ఏఐఏఆర్ఎల్ఏ), ధర్మేందర్ (ఏఐఏకెఎస్ యూ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లఖింపూర్ ఘటన నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని నిర్ణయించారు. రైతులపై కారును పోనివ్వటం ద్వారా హత్య చేసిన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అశీష్ మిశ్రా తేని, ఇతర నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయకపోగా నేరస్తులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పైపెచ్చు సంఘటను పక్కదారి పట్టించేందుకు రైతులను ఖలిస్తాన్ లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయాన్ని పొందేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని తీర్మానించారు. న్యాయాన్ని ప్రభావితం చేయకుండా ముందుజాగ్రత్తగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సామాన్యులు, వ్యవసాయ కార్మికుల జీవితాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్న మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజల ఆదాయం పడిపోతూ నిరుద్యోగం పెరిగిపోతుండటంతో కొనుగోలు శక్తి పడిపోతున్నదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బీజేపీ అవలంభిస్తున్న మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాలతో ధరలు పెరిగి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే వారికి కులాల ఆధారంగా నిధుల కేటాయిస్తూ జీవితాలను ఛిద్రం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో కోట్లాది మంది ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తుంటే కేంద్ర విధానాలు ఇండ్లున్న వారిని నిర్వాసితులుగా మారుస్తున్నాయనీ, అటవీ పరిరక్షణ చట్టంలో చేస్తున్న మార్పులు అటవీ హక్కుల చట్టంతో సాధించుకున్న ఫలితాలను వెనక్కి తీసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ హిందుత్వ విధానాలతో దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికుల సామాజిక, ఆర్థిక భరోసాను కాపాడేందుకు హిందుత్వ విభజన రాజకీయాలు, నూతన సరళీకత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఐక్యపోరాటం కొనసాగించాలని వారు ప్రతినబూనారు.