Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలురైతును పట్టించుకోం
- వారితో అసలు రైతులకే మోసం
- ప్రశ్నోత్తరాలలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ, ఏదన్నా కానీ.. అదంతా ఒట్టి బోగస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కౌలురైతులను పట్టించుకోబోమని మరోమారు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో 'భారీ వర్షాలు.పంట నష్టం'పై ఆయన మాట్లాడారు. 'తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతోంది. పారదర్శకత కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. రైతులకు చాలా ఉపశమనం లభించింది. అబ్దుల్లాపూర్‌మెట్ లాంటి ఘటనలు జరగకుండా ధరణి తెచ్చాం. దానిద్వారా లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూమిని కాపాడుకునే రైతును కౌలు రైతు పేరు మీద బలి చేయదలుచుకోలేదు. అందుకే ధరణి పోర్టల్‌లో ఆ కాలమ్స్ తొలగించాం. కౌలు అనేది ప్రయివేటు వ్యవహారం. ఇది ఆ రైతుకు, కౌలు రైతుకు మధ్య ఉన్న ప్రయివేటు ఒప్పందం. కౌలుదారు మారినప్పుడల్లా ప్రభుత్వాలు రికార్డులను మార్చాలంటే కుదరదు. అది ప్రభుత్వం పని కాదు. కౌలు రైతుల విషయాన్ని మేం పట్టించుకోం. అయితే, కౌలు రైతుల పట్ల మాకు మానవీయత ఉంది. కానీ అసలు రైతు నష్టపోవొద్దనేది మా పాలసీ. అసలు రైతులు తమ భూములను వారసత్వంగా కాపాడుకుంటున్నారు. వారికి కష్టాలొస్తే ఉపవాసమైనా ఉంటారు కానీ.. భూములను అమ్ముకోరు. అలా కాపాడుకున్న భూమిని కొందరు పైరవీకారుల వల్ల గద్దల్లా తన్నుకుపోయే పరిస్థితి రావొద్దు. రైతుల సంక్షేమం దృష్ట్యా కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. ఒక వేళ కౌలు రైతులు నష్టపోతే.. తప్పకుండా వారిని మానవీయ కోణంలో ఆదుకుంటాం. ఆర్వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ భూములకు పట్టా ఉండటంతో 3 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నాం. రైతాంగానికి మంచి పనులు చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. కౌలు, గిరిజన రైతులు నష్టపోతే.. వందో, రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తాం' అని సీఎం అన్నారు. పలువురు నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో తేవాల్సిన మార్పులపై కేంద్రానికి సూచనలు చేసినా, నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. రైతులు అప్పుల కోసం వెళ్తే ప్రీమియం కట్టించుకుంటున్నారనీ, ఈ విషయంలో కేంద్రం విధానాలు సరిగా లేవని పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదనీ, దానితో రైతులకు లాభం లేదని విమర్శించారు. ఆ పథకంపై కేంద్రానికి సూచనలు పంపుతామన్నారు. కేంద్రాన్ని మేం విమర్శించడం, వారు మమ్ముల్ని విమర్శించడం సరిగాదని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గిడ్డంగులను నిర్మించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ కేంద్రం బాహాటంగానే చెప్పిందని తెలిపారు. హైదరాబాద్‌లో వరదల వల్ల రూ.8 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపితే నేటికీ చడీచప్పుడు లేదని విమర్శించారు. ప్రకృతి విపత్తు జరిగితే కొంత డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నా దాన్నీ పట్టించుకోలేదనీ, పరిహారం కింద పైసా కూడా ఇవ్వలేదని సీఎం వివరించారు. పంట నష్టపరిహారానికి సంబంధించి మోకాళ్ల లోతు నీళ్లలో పంట మునిగితేనే పరిహారం ఇస్తారనీ, కేంద్ర బృందం వచ్చే సరికి ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. పరిహారం విషయంలో అనేక షరతులు విధిస్తారని వివరించారు.