Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్లలో సంక్షేమం కోసం రూ. 74,165 కోట్లు ఖర్చు
- కేంద్రంపై సీఎం కేసీఆర్ చురకలు
- అసెంబ్లీ చర్చలో ఆసక్తికర వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''కేంద్రం తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? రాష్ట్ర హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుంది. తెలంగాణే కేంద్రానికి ఇస్తున్నది. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదు. పోయింది రూ.2.74 లక్షల కోట్లు..వచ్చింది రూ. 42 వేల కోట్లు.. దేశ ఖజానాకు నిధులు సమకూర్చే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. కేంద్రం అసలు ఇస్తే కదా నిధులు మళ్లించేది' అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలఅమలుపై శుక్రవారం శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్ష తన జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. సీఎం మాట్లాడుతూ పదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 21,663 కోట్లిస్తే, టీఆర్ఎస్ సర్కార్ రూ.74,165 కోట్లు ఖర్చు చేసిందనితెలిపారు. ఏపీ తలసరి ఆదాయం 1.7లక్షలు, తెలంగాణది రూ. 2.37 లక్షలని వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు రాష్ట్రంలో పని చేస్తున్నారన్నారు. ఉపాధిపెరిగింది. ఒకనాడు మనం వలస పోయాం.నేడు పొరుగు రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వలస వస్తున్నారన్నారు.
'కేంద్రం పెత్తనం సరికాదు'
రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం తీసు కెళ్తాం. వైఎస్ హయాంలోనే తెలంగాణకు చాలా అంశాల్లో నష్టం జరిగింది. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిం చాలని ఆదేశించాం. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్ కార్డులకు మళ్లీ అర్జీలు స్వీకరిస్తాం. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామన్నారు.
'రోశయ్య ఉరితాడు తెచ్చుకుండే.'
టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి పథకాలను విమర్శిస్తున్న కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ వంగ్యంగా వ్యాఖ్యానించారు. మీరు నీళ్లు ఇవ్వలేదు.. మేం ఇస్తున్నాం. మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ ఉండే. మాకున్నాయి. కరెంట్ మీరు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. మీ హయాంలో అపర మేధావులు, ప్రపంచ మేధావి ఉండే. ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు. రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు రెండేండ్లలో విద్యుత్ వ్యవస్థను మంచి గా చేసి ఇస్తా.. లేదంటే ఇదే శాసనసభలో ఉరేసుకుంటా అన్నారు. ఆయన గాశారం బాగాలేక అది కాలేదు. ఓసారి మధ్యాహ్నం సెషన్‌కు బ్రీఫ్‌కేస్‌లో తాడు తెచ్చుకున్నాడు. మేమందరం వారించి వద్దన్నామని చెప్పారు.
'అన్ని మతాలనూ గౌరవిస్తాం'
రాష్ట్రంలో మసీదులు, దేవాలయాలు, చర్చిలకు నిధులు ఇస్తూ అన్ని మతాలనూ గౌరవిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. సెక్రటేరియట్లో గుడి, మసీదును అందంగా తీర్చిదిద్దుతాం. బోనాల పండుగకు నిధులు ఇచ్చి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. యాదాద్రి ఖ్యాతి విశ్వవిఖ్యాతమ య్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కట్టే పన్నులను సమన్వయం చేసి తిరిగి ప్రజల అవసరాల కోసం ఎట్ల వాడుతామనేది నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.
రాజాసింగ్‌కు సీఎం చురకలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. సంక్షేమ పథకాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చర్చలో జోక్యం చేసుకుంటూ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కొంతమంది లంచాలు తీసుకున్నట్టు రిపోర్టు వచ్చింది. నేనే మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో ఆలోచించాను. అవును సర్.. నిజమే అని చెప్పారు. కల్యాణలక్ష్మి చెక్‌ల పంపిణీనీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పెట్టాలని నిర్ణయించాం. ఆయన సంతకం పెడితేనే చెక్ మంజూరవుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరద్దీన్ ఓవైసీ, బీజేపీ రాజాసింగ్ అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. హౌంగార్డులకు మంచి జీతాలు ఇస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం
దేశం మొత్తంలో కూడా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నరేగా కార్యక్రమం జరుగుతున్నది. వాస్తవం చెప్పాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన తర్వాతే డబ్బుల వినియోగంతో పాటు పని దినాలూ పెరిగాయి. అసెట్స్ క్రియేట్ అవుతున్నాయి.వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
అందుకే ఐదో తరగతి నుంచి గురుకులాలు ప్రారంభించాం..
కేజీ టు పీజీ కార్యక్రమానికి నేనే రూపకల్పన చేశాను. మంచి విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీపడి బతుకు తారు. గురుకుల పాఠశాలలు ప్రారంభించడానికి ముందు మేధావులతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఇవాళ గురుకులాల్లో పెట్టే డైట్‌ను కూడా నేనే తయారు చేశాను. ఐదో తరగతి లోపు పిల్లలను గురుకులాల్లో వేస్తే హౌం సిక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. మేధావులు, చైల్డ్ సైకాలజిస్టుల సూచనల మేరకు ఐదో తరగతి నుంచి గురుకులాలను ప్రారంభించాం.
సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం స్కీం ప్రారంభిస్తాం..
ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేవారికి నగదు అందిస్తాం. కరోనా వల్ల ఆలస్యమైంది. వంద శాతం ఈ స్కీంను త్వరలోనే ప్రారంభిస్తాం. నియోజకవర్గానికి వెయ్యా, పదిహేను వందలు ఎంత అనేది ఆలోచిస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విమర్శలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలన బాగాలేదనే కదా ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మేం కొట్లాడినం కాబట్టే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని సీఎల్పీనేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. నీళ్లు-కరెంట్ ఇచ్చామంటు న్నారు.. ఎక్కడి నుంచి ఇచ్చారో చెప్పాలి ? అని భట్టి డిమాండ్ చేశారు.
కొట్లాడుతూనే ఉంటా: అక్భరుద్ధీన్
హైదరాబాద్ నగరంతోపాటు ముస్లిం మైనార్టీల సమస్యలపై నేను కొట్లాడుతూనే ఉంటానని ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దన్ ఓవైసీ అన్నారు. అనేక సమస్యలపై తాను సీఎంకు దరఖాస్తులు ఇచ్చాననీ, వాటిని అయన మంజూరు చేశారని అన్నారు. అసెంబ్లీలో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.