Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల సమ్మె విజయవంతం
- విధులు బహిష్కరించిన కార్మికులు
- లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనం అమలుకు పోరాడుదాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
నవ తెలంగాణ- మఫిసిల్ యంత్రాంగం
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేతనాలు సవరించాల్సి ఉందనీ, కనీస వేతనాల జీవోను సవరించి తొమ్మిదేండ్లు గడిచినప్పటికీ సవరించడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు విమర్శించారు. కార్మికుల ఐక్యతతోనే హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు. విడుదల చేసిన 5 జీవోలను వెంటనే గెజిట్ చేయాలని, కనీస వేతనం రూ. 21 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనాల అమలు కోసం జీవోలను తక్షణమే సవరించాలనీ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త సమ్మె విజయవంతమైంది. వివిధ రంగాల కార్మికులు ఎక్కడికక్కడ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులంతా ర్యాలీలు, బైక్ ర్యాలీలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కార్మిక చట్టాలపై కేంద్ర చేస్తున్న కుట్రలను ఉపసంహరించుకోవాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోడ్లపై బైటాయించి నిరసన తెలిపారు. మున్సిపల్, పంచాయతీ కార్మికులు తెల్లవారుజాము నుంచే విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన సమ్మె లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, పాల్గొని మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యా లకు తొత్తులుగా మారి కార్మికులను కట్టుబానిసలుగా హోల్ సేల్‌గా వారికి అప్పజెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికు ల హక్కులకోసం సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర నిర్వ హించి, కార్మికుల్లో చైతన్యం తెచ్చిందన్నారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి సీఐటీయూ తరపున కేటీఆర్‌కు సవాలు చేస్తున్నామనీ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతానికి గానీ, రాష్ట్రంలోని ఏ పారిశ్రామిక ప్రాంతానికి గాని వస్తే కార్మికుల స్థితిగతులను చూపుతామనీ, తాము ఏ విధమైన చర్చకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందుకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు.
సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పాల్గొని మాట్లాడారు. కార్మికలోకం ఐక్యపోరాటం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను రద్దుచేస్తుందనీ, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన జీవోలను గెజిట్ చేస్తుందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారి పోతున్నాయన్నారు. పటాన్ చెరులోని పారిశ్రామిక వాడలోని కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలోని వర్గల్, గజ్వేల్, మర్కుక్లలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు. సిద్ధిపేటలో మున్సి పల్ కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో, గ్రామ పంచాయతీ కార్మికులు జెడ్పీ కార్యాలయంలో, బీడీ కార్మికులు కార్మికశాఖ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరం పేటలో కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
జీడిమెట్ల డిపో నుంచి పారిశ్రామికవాడ మీదుగా కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాపూర్‌నగర్‌లోని సాగర్హౌటల్ చౌరస్తాలో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించి 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. 2014-16లలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చేసిన సిఫార్సులను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. సనత్‌నగర్ పారిశ్రామికవాడలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలైన కాటేదాన్, కొత్తూరు, ఆదిభట్ల, గండిపేట్, షాద్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, చేవెళ్ల, మహే శ్వరం, రావిరాల ప్రాంతాల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నాగార్జునసాగర్ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ ఎదుట, ఉప్పల్ పారిశ్రామికవాడలో నిర్వహించిన సభల్లో రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొని మాట్లాడారు. గండిపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. టీఎస్ఐ పాస్‌తో పరిశ్రమ అధిపతులకు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభు త్వం ఊడిగం చేస్తుందని తెలిపారు.
కనీస వేతనాలను పెంచి అమలు చేయకుంటే మరోసారి సమ్మెకు వెళ్తామని హెచ్చరిం చారు. భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కోల్‌బెల్ట్ వ్యాప్తం గా కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సింగరేణి హెడ్ఆఫీస్ ఎదుట ఉదయం 9గంటల నుంచి సుమా రు మూడు గంటల పాటు వందలాది మంది కాంట్రాక్టు కార్మికు లు భారీ ధర్నా నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు జీవో 22 ప్రకారం నూతన వేతనాలు తక్షణమే చెల్లించాలనీ, కాలయాపన చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. భద్రాచలంలో సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. బూర్గంపాడులో సారపాక ఐటీసీ పరిశ్రమ గేటు ఎదుట, లక్ష్మీపురం పేపర్ గోదాముల ఎదుట ధర్నా నిర్వహించారు. టేకులపల్లి, ఇల్లందు, ములకలపల్లి, దుమ్ముగూడెం, సుజాత నగర్, పినపాక, సుజాతనగర్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అంద జేశారు. యదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికులు నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర కార్య దర్శి భూపాల్ పాల్గొని మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేస్తామని, అందరికీ కనీస వేత నాలు చెల్లిస్తామని, కార్మిక చట్టాలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడు స్తున్నా నేటి వరకూ అమలు చేయలేదన్నారు. బీబీనగర్‌లో ప్రద ర్శన నిర్వహించి రాస్తారోకో చేశారు. సంస్థాన్‌నారాయణపురంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్‌లో 65వ నెంబర్ జాతీయ రహదారిపై వివిధ రంగాల కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వివిధ రంగాల కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగులను లోపలికి వెళ్లనీయండా అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులతో పాటు కార్మికులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఈ క్రమం లో కార్మికులు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు, తోపులాట జరిగింది. పలువురు నేతలకు గాయాలయ్యాయి. చండూరు, నాంపల్లి, నార్కట్‌పల్లిలో కార్మికులు తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. దామరచర్లలో ధర్నా చేశారు. హాలియాలో నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. హుజూర్నగర్, కోదాడలో రాస్తారోకో నిర్వహించి ర్యాలీ చేపట్టారు.
కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ ఇండిస్టీ, సిరిసిల్ల జిల్లాలో పవర్‌లూమ్స్, గోదావరిఖనిలో బొగ్గుగనుల్లో పనులు బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట మరమగ్గాల కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లా డుతూ.. మరమగ్గాల కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బతుకమ్మ చీరలకు సంబంధించి 2019-21 వరకు కార్మికులకు రావలసిన 10 శాతం యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకం పట్ల ఇంకా కాలయాపన చేస్తున్నారన్నారు. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీకార్మికులు స్థానిక ఆర్డీఓ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులంతా పెద్దఎత్తున ర్యాలీ నిర్వ హించి, అక్కడే ధర్నా చేశారు. కొత్తపల్లి, చొప్పదండి, రామ గుండం, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోనూ కార్మికులు సమ్మెకు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నుంచి కలెక్టరేట్ వరకు హమాలీ కార్మికులు ర్యాలీ చేశారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
నిజామాబాద్‌లో లేబర్ కమిషనర్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జక్రాన్‌పల్లిలో దిష్టిబొమ్మ దహనం చేశారు. బోధన్‌లో ఆర్డీవో, ఆర్మూర్‌లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతిపత్రం అందజేశారు. కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మికులు గాంధీపార్కు నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ సుమారు 2గంటల పాటు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక్‌చౌక్, కుమురంభీంచౌక్ గుండా ర్యాలీ కలెక్టరేట్‌కు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, తెలంగాణ చౌరస్తాలో కార్మికులు ధర్నా చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్ అలీ పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద కార్మికులు ధర్నా చేసి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ ర్యాలీ నిర్వహించి అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జయశంకర్, మహబూబాబాద్, జనగామ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. పట్టణాల్లో, పలు మండలాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.