Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం : రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా దళితులకు మూడెకరాలిస్తామని సీఎం కేసీఆర్ నాలుగుసార్లు ప్రకటించారనీ, ఇప్పుడు మూడెకరాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదంటూ అదే సభలో వ్యాఖ్యానించడం సభా హక్కుల ఉల్లంఘన కిందనే వస్తుందనీ, దీనిపై ఆయన నోటీసులు ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామనీ, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. 2014లోనూ మ్యానిఫెస్టోలో ఇదే అంశాన్ని పొందుపర్చారని గుర్తుచేశారు. కోనేరు రంగారావు, గిర్గ్లాని కమిటీ సిఫారసులను ఎందుకు అసెంబ్లీలో చర్చకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచని కేసీఆర్.. కులాల లెక్కలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడని విమర్శించారు. కుల గణన అంశం సుప్రీంకోర్టులో ఉందనీ, ఆ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాన మంత్రి మోడీని కలుద్దామన్న హామీ ఏమైందన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. బట్టగాల్చి మీద వేసే ధోరణిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మానుకోవాలని సూచించారు. తమకూ ఆయనలా తిట్లు వస్తాయనీ, కానీ, అలా తిట్టడం సభ్యత కాదన్నారు. ఇతర సీఎంలతో పోల్చడం, ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని పదేపదే విమర్శించడం సరిగాదన్నారు. ఒక్కోప్రాంతంలో ఒక్కో పరిస్థిలుంటాయనీ, అక్కడ ఉన్న పథకాలు మన రాష్ట్రంలో ఎందుకు లేవో కూడా చెప్పాలని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్దిపొందేందుకు శాసనసభా సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ వాడుకున్నదని విమర్శించారు. ఉప ఎన్నికలున్న ప్రాంతాలకే నిధులు, అభివృద్ధి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలకూ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.