Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే 48 గంటల్లో అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, రాష్ట్రం మీదుగా నెలకొన్న ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్ది, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటెండ్రు ప్రదేశాల్లో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్లో అత్యధికంగా 9.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్లో 8.65 సెంటీమీటర్లు, ఫిరోజిగూడలో 7.18 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ పరిధిలోని పాటిగడ్డలో 7.05 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలో మొత్తంగా 269 ప్రాంతాల్లో వర్షపాతం రికార్డయింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఏర్పడి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ ఆవర్తనం ప్రభావం వల్ల వచ్చే 48 గంటలలో ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రారతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉన్నది. తిరోగమన నైరుతి రుతుపవనాలు వాయువ్య, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని ఇంకా కొన్ని భాగాల నుంచి వెనక్కి తిరిగాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశాలోని కొన్ని భాగాల నుంచి విరమించే అవకాశమున్నది.