Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడలోని బంగారు కాసులు తీసుకుని కొడుకు పరార్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మద్యానికి బానిసైన ఓ కసాయి కొడుకు.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని రోకలి బండతో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన రామచంద్రునిపేట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లూరి పగడమ్మ(75)కు ఎనిమిది మంది సంతానం కాగా అందరికీ వివాహాలై స్థిరపడ్డారు. కాగా ఏడో సంతానం అయిన కల్లూరి నర్సింహారావు మద్యానికి బానిస కావడంతో ఆరేండ్ల కిందట భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నర్సింహారావు తల్లి పగడమ్మ వద్దే ఉంటున్నాడు. రోజూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పడేవాడు.శుక్రవారం అర్ధరాత్రి నర్సింహారావు బాగా తాగి వచ్చాడు. ఇంకా తాగేందుకు డబ్బులు కావాలని తల్లితో గొడవ పడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో రోకటి బండతో మొఖంపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం విడిచింది. అనంతరం ఆమె మెడలో ఉన్న నల్లపూసల తాడు తెంపి దానిలోని బంగారపు కాసులు తీసుకుని పరారయ్యాడు. మృతురాలి ఆరో కుమారుడు కల్లూరి వీరస్వామి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేశారు.