Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలని చేర్యాల పట్టణ బంద్
- అఖిలపక్ష నాయకుల అరెస్ట్
నవతెలంగాణ- చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల పీఏసీఎస్, ఐకేపీల్లో యాసంగి వడ్ల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని అఖిలపక్షం, ప్రజాసంఘాలు పట్టణ బంద్ చేపట్టాయి. బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం చేపట్టిన ఈ బంద్‌కు ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. ఈ క్రమంలో ఉదయమే అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసి కొమురవెళ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయినప్పటికీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ రామగళ్ల పరమేశ్వర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తున్న క్రమంలో నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. అధికార యంత్రాంగం అవినీతి నిర్మూలన చేయడానికి సహకరించాల్సింది పోయి అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిసున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి నిందితులందరిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చేర్యాల పీఏసీఎస్, ఐకెపీలోనే కాకుండా జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, బచ్చన్నపేట, జనగామ చీట కోడూరు, నర్మెట, పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో కూడా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ప్రభుత్వ ధనాన్ని కోట్లల్లో కొల్లగొట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో అన్ని పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేసి దోషులను శిక్షించాలని కోరారు. బంద్‌కు సహకరించిన ప్రజలకు, వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.