Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన గ్రోమోర్ ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ - ఉండవెల్లి
నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టడంతో పంటలు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోయామని మన గ్రోమోర్ ఎదుట రైతులు శనివారం ఆందోళన చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన దాదాపు 20 మంది రైతులు మన గ్రోమోర్లో 'కావేరి జాదు' రకానికి చెందిన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశారు. ఈ విత్తనాల వల్ల పైరు ఎదగలేదు. దిగుబడి రావడం లేదు. దీంతో మోసపోయామని గ్రహించిన రైతులు గ్రోమోర్ దుకాణాన్ని మూసేసి మందు డబ్బాలతో నిరసన తెలిపారు. పంట సాగు కోసం ఇప్పటి వరకు ఒక్కో రైతు ఎకరానికి రూ.50 వేలు ఖర్చు చేశామన్నారు. 20 మంది రైతులకు సంబంధించి దాదాపు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు రైతులు చెప్పారు. తమకు పరిహారమిచ్చే వరకు గ్రోమోర్ సెంటర్ నిర్వహణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారిణి శ్వేతను వివరణ కోరగా.. కావేరి జాదు పత్తి విత్తనాలు వేసిన మొక్కలను పరిశీలించామని, పరీక్ష నిమిత్తం వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపామని తెలిపారు.