Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరి వేయొద్దనడంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఈ చట్టాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు వారి పొలంలో ఏ పంట పండించుకోవాలో నిర్ణయించడం కాకుండా ప్రభుత్వం శాసించడమేమిటని ప్రశ్నించారు. ఒకవైపు వ్యవసాయ కమిషనర్ రైతులకు వరి విత్తనాలు అమ్మొద్దని ప్రయివేటు విత్తన కంపెనీలకు ఆదేశాలిస్తున్నారనీ, మరోవైపు సీఎం గతంలో కేంద్ర చట్టాలు అమలు చేయబోమని భారత్‌బంద్ చేపట్టి, ఇప్పుడు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. వరికి బదులు పొద్దు తిరుగుడు, పప్పు ధాన్యాలు పండిచమనడం ఏమిటనీ, సొంత పొలంలో ఏం పండించాలనే స్వేచ్ఛ రైతులకు లేదా?అని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనీ, వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం కేంద్రానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం, ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పోడుభూములకు హక్కు పత్రాల కోసం ఎమ్మెల్యే కాకుండా గ్రామకార్యదర్శుల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేశారు. పోడుసాగుదార్లకు హక్కుపత్రాలు మంజూరు చేసేలోగా, వారిపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, పోలీసులు, అటవీ, రెవెన్యూ అధికారుల దాడులు నిలిపివేయాలని కోరారు. పోడు భూములకు రైతుబంధు, రైతు బీమా పథకాలు వర్తింపజేయాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తానెన్నడూ అనలేదని చెప్పడం ద్వారా హామీల అమలులో కేసీఆర్ చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీ పరిస్థితే ఇలా ఉంటే, దళిత బంధు సైతం హుజూరాబాద్ ఉప ఎన్నికల వరకే పైలట్ కింద అమలు చేసి తూతూమంత్రంగా ముగిస్తారేమోననే అనుమానాలున్నాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా విమర్శించారు. లఖింపూర్ ఖేరీలో రైతులను కారుతో తొక్కి చంపిన ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే పోలీసు విచారణకు హాజరుకావడం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.