Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీవాద, విద్యార్థి, ప్రజాస్వామిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక ఉద్యమకారిణి గుల్ఫీషా ఫాతిమాను 18 నెలల నుంచి కటకటాల వెనుక ఉంచడాన్ని స్త్రీవాద, విద్యార్థి, ప్రజాస్వామిక సంఘాలు విమర్శించాయి. ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మహిళా, ట్రాన్స్‌జెండర్ సంఘాల వ్యక్తుల ఐక్యకార్యాచరణ (డబ్ల్యూటీ జేఏసీ), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎం), జన్ ఆజాదీ 75, అనేక ఇతర ప్రజాస్వామ్య సంఘాలు, పౌరులు కలిసి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రమా మెల్కోటే, సూరేపల్లి సుజాత, పీవోడబ్ల్యూ నేత సంధ్య, అంబిక, కృష్ణకుమారి, దేవి, కె సజయ, దీప్తి, అస్మా, విద్య వంగపల్లి, మీరా సంఘమిత్ర మాట్లాడుతూ సీఏఏ వ్యతిరేక కార్యకర్త గుల్ఫీషా ఫాతిమాపై ఢిల్లీ పోలీసులు ఉపా చట్టాన్ని నమోదు చేశారని అన్నారు. ఆ చట్టాన్ని నమోదు చేసిన రాజకీయ ఖైదీలందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుల్ఫీషా ఫాతిమాను అరెస్టు చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం బెయిలుపై విడుదల కాకుండా ఎన్నో కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఆమెను జైల్లో ఉంచడం రాజ్యాంగ వ్యతిరేకమనీ, హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఆమె విడుదల కోసం చేసే పోరాటం భవిష్యత్‌లో స్త్రీవాద ఉద్యమాలకు ఒక ముందడుగు అవుతుందని చెప్పారు.