Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీలు, లైసెన్స్‌దారులు, రైతుల్లో ఆందోళన
- అర్థాంతరంగా తరలించడంపై అసంతృప్తి
- మట్టి రోడ్లు, బురదమయం
- పరిశీలించిన రైతుసంఘం బృందం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో కొన్ని దశాబ్దాలుగా పండ్ల మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కొత్తపేట పండ్ల మార్కెట్ (గడ్డి అన్నారం) ఉనికి కోల్పోనుంది. సుమారు 22 ఎకరాల సువిశాలమైన స్థలంలో రైతులు, వ్యాపారులు, వినియోగదారులతో నిత్యం కళకళలాడే పండ్ల మార్కెట్ ఇక కనుమరుగుకానుంది. ఆపిల్, నారింజ, అరటి, బత్తాయి, నిమ్మ, జామా,సీతఫల్, మామిడి పండ్లకు ప్రసిద్ధి. అక్కడ సీజన్‌వారీగా పండ్ల వ్యాపారం పెద్దఎత్తున్న సాగుతుంది.అలాంటి మార్కెట్‌ను సర్కారు తరలించడంతో బోసిపోయింది. కేవలం ఐదారు మంది సిబ్బంది, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవర్ని లోపలికి రాన్వికుండా బారీకేడ్లు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, చత్తీస్ఘడ్, కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల నుంచి రైతులు, వ్యాపారులు తమ పంటలను అమ్ముకుంటారు.అలాంటి వాహనాలను బాటసింగారానికి పోవాలని సర్కారు సూచిస్తున్నది. శనివారం తెలంగాణ రైతు సంఘం బృందం గడ్డి అన్నారం, బాటసింగారం, కోహెడ వ్యవసాయ కేంద్రాలను పరిశీలించింది. బృందంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, పండ్ల తోటల సంఘం రాష్ట్ర కన్వీనర్ కున్‌రెడ్డినాగిరెడ్డి, సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ ఎం వీరయ్య బృందం ఆయా మార్కెట్లను సందర్శించింది. ప్రయివేటు సంస్థలు ఏర్పాటు చేసుకున్న గోదాములు, భవనాలను ప్రభుత్వం 1.80 కోట్లకు అద్దెకు తీసుకుంది. అందులోకి మార్కెట్‌కు తరలించాలని నిర్ణయించింది. అయితే ఈనెల 18వరకు కొత్త మార్కెట్లోనే కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినా, తీర్పు కాపీ అందలేదనే సాకుతో మార్కెట్‌ను తరలించింది. అయితే బాటసింగారం మార్కెట్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. అక్కడక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేశారు. హమాలీ కార్మికులకు విశ్రాంతి గదులు, వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. ప్రయివేటు గోదాముల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పరిశీలనా బృందానికి ఓపెన్ మార్కెట్ యార్డు పరిశీలనకు అనుమతి ఇవ్వలేదు. మార్కెట్ యార్డును ఫోటోలు తీయడాన్ని నిషేధించింది. బత్తాయి, బొప్పాయి. ఆపిల్ పండ్ల వ్యాపారానికి కొన్ని షెడ్లు ఉన్నాయి.లక్షల టన్నులు వచ్చే మామిడి కోసం ప్రత్యేక షెడ్లు లేవు. దీంతో రైతులు, హమాలీలు, లైసెన్స్‌దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాటసింగారంలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. భారీ వాహనాలు బురదలో దిగబడే అవకాశం ఉన్నది. లోడింగ్, అన్‌లోడింగ్‌కు హమాలీలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సరాసరిగా రోజుకు 100 నుంచి 150 వరకు భారీ లారీల్లో లోడ్లు వస్తాయి. ఈనేపథ్యంలో ఉన్నట్టు ఉండి మార్కెట్‌ను తరలించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. హమాలీలు మార్కెట్ చుట్టు ప్రక్కల ఇండ్లు కిరాయిలకు తీసుకుని ఉంటున్నారు. ఉదయం ఐదుగంటలకే లారీలను లోడింగ్, అన్లోడింగ్ చేస్తారు. దీంతోపాటు హైదరాబాద్‌కు బాటసింగారం 30 కిలో మీటర్లు ఉంది. అనంతరం కోహెడ్ వ్యవసాయ మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని బృందం పరిశీలించింది. విశాలమైన స్థలం ఉన్నప్పటికీ అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా, బాటసింగారంలో అద్దెకు తీసుకోవడం పట్ల బృందం అనుమానం వ్యక్తం చేసింది. కోహెడ మార్కెట్ ఔటర్సింగ్రోడ్కు దరిదాపుల్లోనే ఉన్నది. భారీ వాహనాలు ఓఆర్ఆర్ నుంచి నేరుగా మార్కెట్లోకి రావచ్చు.కానీ ప్రభుత్వం మాత్రం బాటసింగారానికి తరలించిందని బృందం అభిప్రాయపడింది.
మార్కెట్‌ను అక్కడే కొనసాగించాలి
.హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌ను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు అక్కడే కొనసాగించాలని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.పరిశీలన తర్వాత ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైందికాదన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేదాక దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.