Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్(టీచర్స్), హెల్పర్స్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దసరా పండుగలోపే అంగన్వాడీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పెంచిన జీతాల బకాయిలను చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్(టీచర్స్), హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పద్మ, పి.జయలక్ష్మి, కోశాధికారి కె.నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు లేఖ రాశారు. సెప్టెంబర్ నెల వేతనాలను ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. జూలై నుంచి 11వ పీఆర్సీలో భాగంగా పెంచిన 30 శాతం వేతన బకాయిలను నేటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ పండుగ జరుపుకునే ఉత్సాహంతో కొత్త బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్‌కు వెళ్తుంటే అంగన్వాడీ ఉద్యోగులు, వాళ్ళ ముఖాలు చూస్తూ బతికే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సెప్టెంబర్ నెల పెండింగ్ వేతనాలు, జూలై నుంచి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.