Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతులకు హక్కుపత్రాలివ్వాల్సిందే
- 15 రోజుల్లో స్పందించకపోతే మళ్లీ ఉద్యమం
- ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన
- నిరుద్యోగ సమస్యపై ఇతర వామపక్షాలతో కలిసి పోరాటం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చింది. బీజేపీ దేశానికే ప్రమాదకరమనీ, ప్రజలకు, రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమని ప్రకటించింది. శనివారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. అనంతరం తనను కలిసిన విలేకర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని చెప్పారు. భారత్ బంద్, ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా, ఈనెల 5న పోడు రైతు రాస్తారోకో కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అయినా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మోడీకి వ్యతిరేకంగా గళం విప్పకపోవడంతో టీఆర్ఎస్కు కేంద్రంతో ఉన్న లాలూచీ అర్థమవుతున్నదని విమర్శించారు. పోడు భూముల సమస్యపై విడివిడిగా చేసిన పోరాటాల కంటే ఉమ్మడిగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలకు మంచి స్పందన వస్తున్నదని అన్నారు. ప్రభుత్వం స్పందించి మంత్రివర్గ ఉపసంఘం వేయడం, పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చాక పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. అందులోనూ కొన్ని షరతులు విధించారని అన్నారు. 2005, డిసెంబర్ 13 వరకు ఉన్న సాగుదార్లకే ఈ చట్టం ప్రకారం పట్టాలిచ్చే అవకాశముందనీ, 2014, జూన్ 2 వరకు సాగులో వారందరికీ పట్టాలివ్వాలనీ, అందుకు కేంద్రం చట్టాన్ని సవరించాలనీ, అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామనీ సీఎం హామీ ఇచ్చారని వివరించారు. ఆ విధంగా చట్టాన్ని సవరించే దాకా ఆగాల్సిన పనిలేకుండా 2005, డిసెంబర్ 13 వరకు సాగులో ఉన్న వారందరికీ వెంటనే పట్టాలివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చి వారం పది రోజుల్లో పట్టాలిస్తామని ప్రకటించకతప్పలేదని అన్నారు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిందన్నారు. 13 లక్షల ఎకరాల్లో సాగు చేసుకున్న రైతులంతా గతంలోనే దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ఒకవేళ దరఖాస్తు చేయాల్సి వచ్చినా గ్రామసభకు చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడమంటే గులాబీ నేతలను ఆశ్రయించడం, వీఆర్వోలు, తహశీల్దార్ల చుట్టూ తిరగాలని ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఉందన్నారు. ఇది చట్టవిరుద్ధమని విమర్శించారు.
కేసీఆర్ ఇప్పటికైనా మాయ నాటకాలకు తెరదించాలనీ, పోడు రైతులకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 15 రోజుల వరకు వేచిచూస్తామనీ, పోడు రైతు సమన్వయకమిటీ సమావేశమై మళ్లీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించిందని గుర్తు చేశారు. దీన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం ఆమోదిస్తున్నదని వివరించారు. కార్మికులకు కనీస వేతనాల కోసం ఈనెల 8న జరిగిన రాష్ట్రవ్యాప్త సమ్మె జయప్రదమైందని చెప్పారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం కనీస వేతనాలను ప్రకటించలేదని విమర్శించారు. కార్మికోద్యమాన్ని, వారి కోర్కెలను సమర్థిస్తూ పెద్ద ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇంటికో ఉద్యోగం అని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఖాళీ పోస్టుల్లేవని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 80 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామనీ, నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారని అన్నారు. నిరుద్యోగ సమస్యపై ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.