Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులందరికీ కార్పొరేషన్ రుణాలివ్వాలి
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ను ఎందుకు నియమించరు?: కేవీపీఎస్ మహాధర్నాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- 21 న కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు పథకాన్ని రాష్ట్రామంతా అమలు చేయాలనీ, అర్హులైనవారందరికీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు మంజూరు చేయాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ను ఎందుకు నియమించటం లేదో కారణం చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద శనివారం కులవివక్ష పోరాట సమితి (కేవీపీఎస)్ ఆధ్వర్యంలో దళితులకు ఇచ్చిన వాగ్దానాల అమలును డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడారు. కేవీపీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చిందని ఆయన చెప్పారు. ఆ చట్టం ప్రకారం బడ్జెట్‌నుంచి వారి అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన నిధులను ఖర్చు పెట్టకుండా దారి మళ్లించడం అన్యాయమన్నారు. దళితుల స్థితిగతుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలోని 14వ పేజీలో వ్యవసాయాధాóరిత ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేశారనీ, ఇప్పుడేమో తామలా అనలేదని అసెంబ్లీలో సీఎం అబద్ధాలు చెప్పారని అన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రం దళితులను వంచన చేయడంలో కేసీఆర్ కంటే మోడీ ఒక ఆకు ఎక్కువే చదివాడని విమర్శించారు. రాజ్యాంగ బద్ద హక్కుల్ని కాలరాస్తూ, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. ప్రభుత్వ రంగాన్నంతా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి, రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకు తెరలేపారని చెప్పారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ అనేక రూపాల్లో దళితుల పట్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఏడేండ్లలో రూ.31 వేలకోట్లను ఖర్చు చేయకుండా మురగబెట్టారనీ, వీటిని రాబోయే బడ్జెట్లో కలిపి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2.30లక్షల మంది దళిత నిరుద్యోగులు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారనీ, కేవలం రూ.786 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎలా రుణాలు దక్కుతాయని ప్రశ్నించారు. కనీసం రూ. 1500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్ల వరకు దళితులకు ఉచిత కరెంట్ ఇస్తూ జీవో ఇవ్వాలన్నారు. మున్సిపల్, జీపీ, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులమతాంతర వివాహం చేసుకున్న వారికి రూ.10లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. వాగ్ధానాల ఆమలు కోసం ఈ నెల 21న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహాధర్నా అనంతరం సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్ల వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా సీఎంకు పంపారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు బాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, టీపీఎస్కే కార్యదర్శి కె హిమబిందు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాలకు సంఘీభావాన్ని ప్రకటించా రు. ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల వేదిక కన్వీనర్ ఆరేపల్లి రాజేందర్, సీబీ ప్రసాద్, ఇరిగి నర్సింగరావు మాట్లాడారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కురుమయ్య, పాలడుగు నాగార్జున, అతిమెలమాణిక్య ం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్గంటపొగు రాజు రాపోలు మహిపాల్, కోటగోపి, టి సురేష్ కుమార్, దయ్యపు రాధాకృష్ణ మహిళా నేతలు గంగామణి, లక్ష్మీదేవి, సాయి లీల, కష్ణమోహిని,ఆయా జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.