Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురి మరణం
- రెండు ఎద్దులు, 16 మేకలు, రెండు గొర్రెలు మృత్యువాత
- నారాయణపేటలో 70 గొర్రెలు...
నవతెలంగాణ- బజార్హత్నూర్, తాంసి, జైనూర్, మక్తల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మృతితిచెందారు. రెండు ఎద్దులు, 16 మేకలు, 2 గొర్రెలు సైతం మృత్యువాతపడ్డాయి. అలాగే, నారాయణపేట జిల్లాలో పిడుగు పడి 70 గొర్రెలు చనిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం బుర్కపెల్లి గ్రామానికి చెందిన రైతు బనియా గరణ్సింగ్(45), ఆశాబాయి(40) వ్యవసాయ చేనులో సోయా పంట కోత కోస్తున్నాడు. ఆ సమయంలో వర్షం రావడంతో సమీపంలోని చింతచెట్టు కిందకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా పిడుగు పడటంతో గరణ్సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆశాబాయిని ఆస్పత్రికి తీసుకెళ్తుంగా మార్గమధ్యలో చనిపోయింది. తాంసి మండలం బండల్‌నాగాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలంలో పత్తి ఏరుతున్న రాఠోడ్ దీపాలి(15) పిడుగుపాటుకు గురై మృతిచెందింది. ఇదే ఘటనలో ఎద్దు మృత్యువాతపడింది. విజయలక్ష్మీ, సుభాపవార్ అనే మహిళలు గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన రైతు షేక్ముజీబ్కు చెందిన ఎద్దు పొలంలో మేత మేస్తుండగా పిడుగుపాటుకు గురై చనిపోయింది. జైనథ్ మండలం సాంగ్వి(కె) గ్రామానికి చెందిన పెర్క ఆనంద్ గ్రామ శివారులో మేకలు మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో 15మేకలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. ఆనంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మేకల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని బాధితుడు చెప్పాడు.
కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గూడమామడ గ్రామానికి చెందిన రైతు గణపతి(35) చేనులో పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతిచెందాడు. ఇదే ఘటనలో సమీపంలో పనిచేస్తున్న రైతులు కుమ్రరాజు, కుమ్ర బొజ్జుకు గాయాలు కావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి శివారులో పిడుగు పడటంతో రెండు గొర్రెలు, మేక మృత్యువాతపడ్డాయి.
70 గొర్రెలు మృత్యువాత
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని రుద్రసముద్రం గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి పిడుగుపడింది. గ్రామానికి చెందిన జంపన్న, కురువ సాబన్న, రమేష్, అంజప్ప, మల్లప్ప గొర్రెలను వ్యవసాయ పొలం వద్ద తోలారు. అర్ధరాత్రి ఉరుములతో కూడిన వర్షంతో పాటు ఆ ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో 70 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణం విడిచాయి. శనివారం ఉదయం గొర్రెల మంద వద్దకు వెళ్లిన కాపరులు.. చెల్లాచెదురుగా విగతజీవులుగా పడి ఉన్న జీవాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.