Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వర్షాలతో అతలాకుతలం
- చెరువుల్లా హైదరాబాద్ రోడ్లు
- నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
- శివారులో వరదల్లో ఇద్దరు గల్లంతు
మళ్లీ గుండె చెరువైంది. గత రెండురోజులుగా మధ్యాహ్నం వరకు ఎండ దంచుతున్నది. సాయంత్రం కాగానే అమాంతంగా భారీ వర్షం పడుతున్నది. శుక్రవారం కురిసిన వర్షానికి మునిగిన ఇండ్లలో నీళ్లు తోడుకుని, ఊపిరి పీల్చుకొనేలోపు శనివారం సాయంత్రం అకస్మాత్తుగా మరోసారి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు ప్రవహించాయి. భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన చేలన్నీ నేలకొరిగాయి. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉన్నదో..తెలియనంతా మురుగునీటితో రహదారులు బురదమయం అయ్యాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. కేవలం ఒక్కగంట ఆగకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం తగిన సహాయ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు ప్రజలను హడలెస్తున్నాయి. రెండ్రోజులుగా సాయంత్రానికి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కారణంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు, భారీ వర్షం కురిసింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా బడంగ్పేట్, మీర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్ ప్రాంతాల్లో భారీ వర్షానికి కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్, అంబర్పేట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలతోపాటు పాతబస్తీలోనూ లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎల్బీనగర్లో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి నాలాలో పడి బయటికొచ్చిన విషయం తెలిసిందే. అంబర్‌పేట్‌లోని ముసారాంబాగ్ బ్రిడ్జీపై భారీ నీళు ్లనిల్వడంతో రాకపోకలను బంద్ చేశారు.
గోడకూలి 50బైకులు ధ్వంసం
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి సైదాబాద్‌లోని శివగంగ థియేటర్‌కు వరదపొటెత్తింది. రాత్రి మొదటి షో నడుస్తుండగానే వరద పొటెత్తడంతో ప్రహరీ కూలిపోయి 50బైకులపై పడింది. దీంతో బైకులు నుజ్జునుజ్జయ్యాయి. థియేటర్లోని కుర్చీలన్నీ నీటమునిగాయి. బైకులు మాత్రమే దెబ్బతియన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జేసీబీ సాయంతో బైకులను బయటికి తీశారు.
జీహెచ్ఎంసీ హెచ్చరిక, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయక చర్యలు కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111కు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచే భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జంటనగరాల్లో వరద కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రానికి ఉన్నట్టుండి భారీ వర్షం వచ్చింది. భారీ వర్షం సూచనతో డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. పలు కాలనీలు, బస్తీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లల్లోకి నీరు చేరింది.
150కుటుంబాల తరలింపు
హయత్‌నగర్ డివిజన్లోని లంబాడీ తండా కాలనీలో వరదనీరు చేరడంతో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద విషయం మేయర్ గద్వాల విజయలక్ష్మికి తెలిసిన వెంటనే హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసి లంబాడీ తండా వాసులను తరలించాలని ఆదేశించారు. వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతిదివాకర్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి తాగునీరు, భోజన వసతి కల్పించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథులానగర్, జిల్లెలగూడ, చంపాపేట్, కోదండరామ్‌నగర్, బంజారాకాలనీ, హయత్‌నగర్‌లోని పలుబస్తీలు కూడా నీటిలోనే ఉన్నాయి.
భారీగా ట్రాఫిక్ జామ్
నగరంలో భారీ వర్షం, రోడ్లపై వరద వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు కంట్రోల్ రూమ్, అసెంబ్లీ ముందు రోడ్డుపై భారీగా నీరు చేరింది. ఎంజే మార్కెట్, నాంపల్లి నుంచి అసెంబ్లీ, లక్డికాపూల్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదర్‌గూడ, లిబర్టీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మలక్‌పేట్ మార్కెట్ నుంచి చాదర్ఘట్ వంతెన వరకు భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్పల్లి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
పొంగుతున్నవాగులు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. లష్కర్‌గూడ, అనాజ్‌పూర్, మజీద్‌పూర్, గుంతపల్లి, బాటసింగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. మజీద్పూర్లో అనిల్ అనే వ్యక్తి చేపలు పట్టడానికెళ్లి గల్లంతైనట్టు సమాచారం. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతైనట్టు స్థానికులు చెబుతున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్ నుంచి హయత్‌నగర్ వెళ్లే మార్గంలో వరద ఉధృతికి బైకు కొట్టుకుపోయింది. బైకుపై వెళ్తున్న ఇద్దరు వరద ప్రవాహానికి వాహనాన్ని నియంత్రించలేక వదిలేశారు.
జిల్లాల్లో నీటమునిగిన పైర్లు
నారాయణపేట జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. మక్తల్, ఉట్కూరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మక్తల్ మండలంలోని నేరడగం గ్రామంలో పైర్లు నేలవాలాయి. గ్రామానికి వెళ్లే లో లెవెల్ వంతెన పూర్తిగా నీట మునిగి రాకపోకలకు అంతరాయమేర్పడింది. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సంగంబండ రిజర్వాయర్ నిండడంతో 6 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.
మత్తడి పోస్తున్న చెరువులు
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మున్సిపల్లోని గణపతి కాలనీ మొత్తం నీట మునిగింది. దీంతో వంట సామాగ్రి బియ్యం, పప్పులు, దుప్పట్లు, పూర్తిగా తడిసిపోయాయి. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ పర్యటించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి ఎన్‌హెచ్ 44పై ఉన్న ఊర చెరువు నిండింది.
చెరువు తూము నుంచి నీరు బయటకు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాబాద్‌లో మండలంలోని చందన్‌వెళ్లి, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, షాబాద్, హైతాబాద్, అంతిరెడ్డిగూడ, తదితర చెరువులు నిండి మత్తడి పోయాయి. మాచన్‌పల్లి చెరువు నుంచి చందన్‌వెళ్లి చెరువులోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. దాంతో పొలాల్లోకి చేపలు కూడా రావడంతో ప్రజలు ఎగబడి పట్టుకున్నారు. గండిపేట చెరువులోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నార్సింగి, మంచిరేవుల, బైరాగిగూడ, గంధంగూడ, హైదర్షాకోట్ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మంచిరేవుల వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని కిష్టపూర్, దిర్సంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీటమునిగింది. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.