Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంచినోడికి.. కొన్నోడికి లాభమే
- మధ్యలో బ్యాంకరే బకరా..!
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బ్యాడ్ బ్యాంక్ కార్పొరేట్లకు వరంగా మారనుంది. భారత్‌లో తొలి బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది దేశంలోని మొండి బాకీలకు పరిష్కార మార్గంగా ఉంటుందని ప్రభుత్వ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నాయి. వాస్తవానికి దీంతో ఒరిగేదేమీ లేదని ఆర్థికవేత్తలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ప్రయివేటు సంస్థల మధ్య అడ్డగోలు ఒప్పందాలను ప్రోత్సహిస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఆర్సీఎల్)ను బ్యాడ్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు. రూ.500 కోట్లు పైబడిన కార్పొరేట్ల మొండి బాకీలను మాత్రమే దీనికి బదిలీ చేస్తారు. రుణాలు తీసుకుని సంబంధిత బ్యాంక్‌ను ముంచిన కార్పొరేట్ కంపెనీకి.. దాన్నీ బ్యాడ్ బ్యాంక్ వద్ద చౌకగా కొనుగోలు చేసే కార్పొరేట్‌కే ఇది లబ్ధి చేకూర్చనుందని స్పష్టమవుతోంది. ఉదాహరణకు.. ఓ కార్పొరేట్ కంపెనీ ఒక బ్యాంక్ వద్ద రూ.1000 కోట్ల అప్పు తీసుకొని ముంచితే.. ఆ ఎన్‌పీఏను బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ చేశారనుకుందాం. ఆ ముంచిన కంపెనీ విలువను తిరిగి బ్యాడ్ బ్యాంక్ లెక్కించి రూ.500 కోట్లుగా విలువ కట్టిందనుకున్నాం. ఇందులో బ్యాంకర్‌కు 15 శాతం అంటే రూ.75 కోట్ల నగదు చెల్లిస్తారు. మిగితా 85 శాతానికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. ఆ కంపెనీ రూ.500 కోట్లు విలువ చేసినప్పటికీ ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు అనుకుంటే.. ఆ విలువను మరింత తగ్గించి.. రూ.300 కోట్లకు తగ్గించారనుకుందాం. దీంతో బ్యాంక్‌ను నిండా ముంచిన కార్పొరేట్‌కు, కొనుగోలు చేసిన కంపెనీకి రెండింటికీ లబ్ది చేకూరనుంది. దీంతో అసలు రుణం ఇచ్చిన బ్యాంకర్ నష్టపోనున్నారు. ప్రస్తుతం బ్యాంక్‌లు రూ.10 లక్షల కోట్ల మొండి బాకీలను ఎదుర్కొంటున్నాయి. ఇందులో తొలి దశలో రూ.90,000 కోట్ల ఎన్పీఏలు బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ కానున్నాయి. ఇందులోంచి 15 శాతం అంటే రూ.13,500 కోట్లు బ్యాంక్‌లకు నగదు రూపంలో అందనున్నాయి. ఈ మొత్తం కూడా 16 బ్యాంక్‌లకు సంబంధించిన నగదు మాత్రమే కావడం గమనార్హం. ఈ బ్యాడ్ బ్యాంక్‌లో ఆయా బ్యాంక్‌లు ప్రధాన ప్రమోటర్లుగా ఉన్నాయి. వాటి మూలధనమే పెట్టుబడి అయినప్పడు కొత్తగా బ్యాంక్‌లకు వచ్చి చేరేదేమీ లేదు. అది కూడా ప్రజల సొమ్మే కావడం విశేషం. మిగితా 85 శాతం సెక్యూరిటీ రూపంలో రానుంది. ఇది కూడా ఏదో ఒక బ్యాంక్ ముందుకు వచ్చి సమకూర్చాల్సిందే. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుతో బ్యాంక్‌ల పద్దుల్లో మొండి బాకీల శాతం తగ్గనున్నది. దీంతో కార్పొరేట్ల ఎన్పీఏల విలువ తగ్గనుంది. తిరిగి ఈ వర్గం వారికి భారీ మొత్తంలో అప్పులివ్వడానికి వీలుంది. దీంతో బ్యాంక్‌లను మళ్లీ వారు కొల్లగొట్టే అవకాశం ఉంది. తిరిగి ఈ భారం డిపాజిట్‌దారులు, పన్ను చెల్లింపుదారులపై పడనుంది. ''ఎన్పీఏ వసూలుకు ఇప్పటికే 26 అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఆర్బీఐ వద్ద నమోదై ఉన్నాయి. మొత్తం బకాయిల్లో ఇవి 26 శాతం మేర మొండి బాకీలను వసూలు చేస్తున్నాయి. రెండో దశ బ్యాంక్ దివాలా చట్టం ద్వారా 21 శాతం ఎన్పీఏలు వసూలు అవుతున్నాయి. ఇక మూడోది బ్యాడ్ బ్యాంక్ రికవరీ చేసేది పెద్దగా ఏమీ వుండకపోవచ్చు'' అని సీనియర్ ఎకనామిక్ జర్నలిస్టు అన్షుమన్ తివారి తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. మోడీ పాలనలో బడా కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలే రుణాలు తీసుకొని ఎగ్గొట్టారనీ, ఈ విషయంలో తాము ఏదో ఒకటి చేస్తున్నామనే భ్రమను ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చర్యకు పూనుకున్నదనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లోని ఎన్‌పిఎలను బ్యాడ్ బ్యాంక్‌లకు బదిలీ చేసి.. ఆ బ్యాంక్‌లను స్వచ్ఛగా మార్చి కార్పొరేట్లకు చౌకగా విక్రయించే అసలు కుట్ర కూడా ఇందులో దాగి ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.