Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పోడు' పై మూడో వారం నుంచి కార్యాచరణ.. అఖిలపక్షం నిర్వహిస్తాం
- నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే: సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం అటవీ భూమి కూడా భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదనీ, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అవసరమైతే నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను అదేశించారు. అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అలా తరలించిన వారికి సర్టిఫికేట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి, రైతుబంధు, రైతుబీమాను కూడా వర్తింపచేస్తామని తెలిపారు. పోడు భూముల అంశం పై శనివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ కూడా పెరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం.హరిత నిధికి విశేష స్సందన వస్తున్నది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనపరచాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది.అసెంబ్లీలో ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించండి '' అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. '' అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ వుంటుంది. వారి జీవనం అడవులతో ముడిపడి ఉంటుంది.. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. అడవులకు హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనెతెట్టె, బంక, పొయిల కట్టెలు తదితర అటవీ ఉత్పత్తుల కోసం మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారు.ప్రభుత్వం వారి జీవన హక్కును కాపాడుతుంది. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం.అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారులదే బాధ్యత. ''నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్ సైడ్ ఈజ్ వోన్లీ ఫారెస్ట్'' ( అడవి తప్ప, లోపల ఎవరూ ఉండడానికి వీల్లేదు) '' అని సీఎం స్పష్టం చేశారు.