Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటెండ్రు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వచ్చే 36 గంటల్లో(సోమవారం అర్ధరాత్రికల్లా) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటొచ్చని పేర్కొన్నారు. తూర్పు అరేబియన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉందని వివరించారు. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా కురిసే సూచనలున్నాయి. నారాయణపేట జిల్లా కోటకొండలో అత్యధికంగా 5.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్గి(నారాయణపేట)లో 5.83 సెంటీమీటర్లు, పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్)లో 4.30 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు 53 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.