Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుని కుటుంబంలో తీవ్ర విషాదం
- నల్లగొండ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-మిర్యాలగూడ
రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందగా.. ఆ వార్త విని గుండెపోటుతో తండ్రి కుప్పకూలాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. తడకమళ్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) మండల నాయకులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్ల ఇంద్రారెడ్డి మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. అతని కుమారుడు గొర్ల భరత్‌రెడ్డి(30). ఆదివారం సాయంత్రం వ్యక్తిగత పనులు పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి వస్తుండగా.. వేములపల్లి మండలం శెట్టిపాలెంలోని సాయిరమణ మిల్లు వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢకొీట్టింది. దాంతో భరత్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుని మరణ వార్త తెలిసిన తండ్రి గొర్ల ఇంద్రారెడ్డి హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై కొడుకు మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయాడు. అక్కడే ఉన్న వేములపల్లి ఎస్ఐ రాజు వెంటనే తన వాహనంలో మిర్యాలగూడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతదేహం ఏరియా ఆస్పత్రిలో ఉండగా, తండ్రి మృతదేహం ప్రయివేట్ హాస్పిటల్లో ఉంది. తండ్రీ కొడుకుల మరణంతో మిర్యాలగూడతోపాటు, ఆయన స్వగ్రామమైన తడకమళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గొర్ల ఇంద్రారెడ్డి తడకమళ్ల పీఏసీఎస్ చైర్మెన్‌గా పనిచేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వేములపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.
పలువురి సంతాపం
సీపీఐ(ఎం) నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి, అతడి కుమారుడు భరత్ రెడ్డి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆస్పత్రులకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంతాపం ప్రకటించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, నర్సిరెడ్డి, నాయకులు నూకల జగదీష్ చంద్ర, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ఘని తదితరులు ఉన్నారు.