Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల్లో అడియలజిస్ట్లను నియమించాలి
- వినికిడి, మానసిక లోపం కలిగిన వారిని గుర్తించాలి
- ఎన్పీఆర్డీ సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతనీ, వారి కోసం సర్కారు ఆస్పత్రులో అడియలజిస్ట్లను నియమించాలని వక్తలు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అడియలజిస్ట్ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్పీఆర్డీ, తెలంగాణ అడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. దీనికి సంఘం కోశాధికారి ఆర్.వెంకటేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హెలెన్ కిల్లర్ విద్యాసంస్థల చైర్మెన్ పి ఉమర్ఖాన్, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడారు. దేశ జనాభాలో 14శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని చెప్పారు. 2001 ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబం మానసిక సంబంధ రుగ్మతలకు గురవుతున్నదని తెలిపారు. 18ఏండ్ల లోపు వయసున్న వారిలో 88లక్షల మంది కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారని గుర్తుచేశారు. వీటి వల్ల ఉపాధి కోల్పోయి నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు. 2017 మానసిక వికలాంగుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
టీఏఎస్‌ఎల్‌పీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కంకిపాటి నాగేందర్, ఇమ్మద్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో వినికిడి సమస్య తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్నదనీ, 15 నుంచి 20 శాతం మంది వినికిడి, మాట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. డీడీఆర్సీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ శ్రీవాత్సవ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సౌత్ రీజియన్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పోరిక మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క అడియలాజిస్ట్ కూడా లేడని చెప్పారు. వినికిడి తీవ్రత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వనికి అసలు చిత్తశుద్ది ఉందా? అని ప్రశ్నించారు.
జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు ఆడియాలజిస్టు కాలేజీలను ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినికిడి పరీక్షలు చేయాలనీ, పుట్టిన ప్రతి శిశువుకు 24 గంటల్లోపే వినికిడి పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి పరీక్ష చేసి అవసరమైన పరికరాలను అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులయిన వారికీ, వారి కుటుంబ సభ్యులకు వినికిడి లోపం ఉంటే పరికరాల కొనుగోలు కోసం పూర్తిస్థాయి సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వినికిడి లోపాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలన్నారు. మాటలు రాని వారికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్పీచ్ థెరపీ క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలనీ లేనిచో ఐక్య ఉద్యమాలకు సిద్దంకాకతప్పదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీఎస్కే కార్యదర్శి కె హిమబిందు, ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యురాలు సాయమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, మల్లేష్, రంగారెడ్డి,రామకష్ణ, గోపి మహమూద్ తదితరులు పాల్గొన్నారు.