Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజ్ఞాన దర్శినీ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.రాధారణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మూఢ నమ్మకాలను నిర్మూలించే చట్టం తేవాల్సిన అవసరముందని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి జి.రాధారాణి అభిప్రాయపడ్డారు. నరేందర దభోల్కర్ హత్యానంతరం మహారాష్ట్ర, కర్ణాటక మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం తెచ్చిందనీ, కేరళ ముఖ్యమంత్రి విజయన చట్టం తీసుకొస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. హైదరాబాద్లో ఆదివారం విజ్ఞాన దర్శినీ అధ్యక్షులు టి.రమేశ్ అధ్యక్షతన నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన, హేతువాదం, మానవత్వం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ ఇప్పటికే విజ్ఞాన దర్శినీతో పాటు మరికొన్ని సైన్సు ప్రచార సంస్థలు కలిసి మూఢ నమ్మకాల నిర్మూలనా చట్ట సాధనా సమితిగా ఏర్పాటు కావటం ముదావహమన్నారు. ఆ సమితి రూపొందించిన డ్రాఫ్ట్, ఇతర రాష్ట్రాలు చేసిన చట్టాల కన్నా సమగ్రంగా ఉందని చెప్పారు. ఈ చట్టం సాధించేందుకు తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరముందనీ, ఇందుకోసం ప్రజలను కదిలించాలని సూచించారు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అశాస్త్రీయ భావజాలం ప్రభావం యువతపై పడుతున్నదనీ, దీంతో వారు మూఢ నమ్మకాలకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. వారికి వైజ్ఞానిక విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. విజ్ఞానం ఎంత పెరుగుతున్నదో అదే స్థాయిలో మూఢ నమ్మకాలు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాణామతి, చేతబడుల పేరుతో మహిళలు, దళితులపై దాడులు జరుగుతున్నాయనీ, కన్నబిడ్డలను సైతం చంపిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకున్నదని గుర్తు చేశారు.
కులం అతి పెద్ద మూఢనమ్మకం : సి.ఎల్.ఎన్.గాంధీ
సమాజంలో మూఢ నమ్మకాల్లోకెల్లా అతి పెద్ద మూఢ నమ్మకం కులమనీ, అందరం కలిసి దాన్ని నిర్మూలించాల్సిన అవసరముందని కుల నిర్మూలనా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.ఎల్.ఎన్.గాంధీ పిలుపునిచ్చారు.
ఇందుకోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనీ, కులరహిత భావాల్ని పెంపొందించాలని సూచించారు. కుల నిర్మూలన సమాజంలో తక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. సైన్సును ప్రజలకు సరళమైన, అర్థమయ్యే భాషలో బోధించాలనీ, ఆటపాటలతో నేర్పించాలనీ, పాఠశాలల్లో సైన్సు నేర్చుకుంటున్నా మూఢ నమ్మకాలను వదలలేకపోతున్నారని తెలిపారు. విజ్ఞాన దర్శినీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ కందుకూరి మాట్లాడుతూ సమాజంలో వైజ్ఞానిక భావజాలాన్ని ప్రచారం చేయటానికి వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. విజ్ఞాన దర్శినీ అధ్యక్షులు టి.రమేశ్ మాట్లాడుతూ యూనిర్సిటీల్లో శాస్త్రీయ పరిశోధనలకు నిధులు కేటాయించకుండా పరిశోధక విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్న పాలకులు మరోవైపు మూఢ నమ్మకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని రమేశ్ విమర్శించారు. ప్రతి జిల్లాలో సైన్స్ సెంటర్ను, హైదరాబాద్లో సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐలయ్య, పరమేశ్, తులసీరాం మాయలు - మహిమలు పేరుతో నిర్వహించిన మ్యాజిక్ షో ఆకట్టుకుంది. ప్లానిటరీ సొసైటీ డైరెక్టర్ జి.రఘునందన్ కుమార్ వీడియోలు, సిమ్యులేషన్ ద్వారా ఖగోళ విషయాలను తెలియజేశారు.