Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసె గోడ కూలి ఐదుగురు మృతి
- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో ఘటన
నవతెలంగాణ- మల్దకల్
పాత గోడ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పొట్టబెట్టుకుంది. వర్షానికి గుడిసె గోడ తడిసి నిద్రిస్తున్న కుటుంబంపై కుప్పకూలింది. దాంతో నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్టే ఐదుగురు ప్రాణం కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపల్లి గ్రామానికి చెందిన మోష- సుజాత దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు రోజు కూలీపని చేసుకుని జీవనం సాగించేవారు. పాతగోడల గుడిసెలో ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి వర్షం పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా గోడ కూలి నిద్రిస్తున్న వారిపై పడింది. దాంతో మోష-సుజాత దంపతులు, వారి ముగ్గురు పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణంతో బయటపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.