Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజమైన గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం
- మరో ఉద్యమం తప్పదంటున్న గిరిజన సంఘాలు
- ఆర్వోఎఫ్ఆర్ ప్రకారం హక్కు పత్రాలివ్వాలని డిమాండ్
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 80వేల మందికి పైగా పోడు రైతులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడు రైతుల విషయంలో ప్రభుత్వం మరో కుటిల యత్నానికి పాల్పడుతోంది. రికార్డ్స్ ఆఫ్ ఫారెస్టు రైట్స్ (ఆర్ఓఎఫ్ఆర్) ప్రకారం కాకుండా ఎమ్మెల్యేల ద్వారా పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అదే ప్రకటించారు. ఇదే జరిగితే పోడు రైతుల భవితవ్యం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్తుంది. అర్హులా? అనర్హులా? అనే విషయం పక్కనపెట్టి సంబంధిత పోడు రైతు తమ పార్టీయా? కాదా? అని చూసి హక్కు పత్రం చేతిలో పెట్టే పరిస్థితి వస్తుందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఆలోచనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని, లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఆర్వోఎఫ్ఆర్ ప్రకారమే హక్కు పత్రాలు ఇచ్చాయని, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ విధానం ప్రకారమే పోడు హక్కు పతాల్రు ఇచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్న విషయాన్ని ఉటంకిస్తున్నాయి.
ఆర్వోఎఫ్ఆర్తోనే అడవిబిడ్డలకు న్యాయం
2005 డిసెంబర్ 13వ తేదీ నాటికి ముందు నుంచి సాగు చేస్తున్నవారికే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన. ఆ తర్వాత సాగు చేపట్టిన వారికి పట్టాలిచ్చేందుకు వీలులేదని దీనిలో పేర్కొంది. అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తు న్నాయి. రాజకీయ లబ్ది కోసం ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తే నిజమైన అర్హులకు అన్యా యం జరిగే ప్రమాదముంది. చట్టంలో పేర్కొన్న విధంగా గిరిజన సంక్షేమశాఖ నోడల్ ఏజెన్సీగా అటవీ, రెవెన్యూశాఖల కలయికతో సర్వే నిర్వహిం చాలని గిరిజన నేతలు కోరుతున్నారు. పోడు భూముల సమస్య ఉన్న అన్ని గ్రామాలు, గూడేల్లో సబ్ కమిటీలు వేసి, నూతనంగా దరఖాస్తులు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ సభలో ఆమోదం పొందిన దరఖాస్తులను సబ్ డివిజనల్ కమిటీకి, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా అటవీశాఖ అధికారితో కూడిన జిల్లాస్థాయి కమిటీకి పరిశీలన నిమిత్తం పంపాలని కోరుతున్నారు.
పాతికేళ్లుగా సాగు చేస్తున్న పోడుదారులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 80వేల మందికి పైగా పోడు రైతులు 4లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో 1.78 లక్షల ఎకరాలకు 2006లో నాటి ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలిచ్చింది. మిగిలిన 2.20 లక్షల ఎకరాలకు రైతులు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చారు. వీరిలో అత్యధికులు పాతికేళ్లకు పైగా పోడు సాగు చేస్తున్నారు. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, వైరా నియోజకవర్గాల్లో పోడు సమస్య అధికంగా ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పాక్షికంగా పోడు భూములు సాగవుతున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఆరువేల ఎకరాలను మూడువేల మంది, కామేపల్లి మండలంలో 410 ఎకరాలు 130 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. బూర్గంపాడులో 3,500 ఎకరాల్లో వెయ్యి ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. ఇల్లెందు మండలంలో 23వేలు, టేకులపల్లి మండలంలో 12వేల ఎకరాలు, కరకగూడెంలో రెండువేల ఎకరాలు, అశ్వారావుపేట నియోజకవర్గంలో 17వేల ఎకరాలు, దమ్మపేట ఫారెస్టు రేంజ్లో 7,800 ఎకరాలు, ఆళ్లపల్లి, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏన్కూరు, కారేపల్లి తదితర మండలాల్లో లక్షలాది ఎకరాల్లో పోడు సాగవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీకి రిజర్వ్ అయిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ లక్షల సంఖ్యలో పోడుదారులు ఉన్నారు. అశ్వారావుపేట మొదలు ఆదిలాబాద్ వరకు పోడు అధిక మొత్తంలో సాగవుతోంది. 2018 నాటికి రాష్ట్రంలో 31.78 లక్షల (9.08%) జనాభా గిరిజనులే ఉన్నారు. వీరిలో 80% మందికి పైగా పోడు ఆధారంగా జీవిస్తున్నారు. 2005లో ఆర్వోఎఫ్ఆర్ చట్టం అమల్లోకి వచ్చాక 6.31 లక్షల ఎకరాలకుగాను 1.84 లక్షల మందికి పోడుహక్కు పత్రాలు ఇచ్చారు. ఇంకా లక్షలాది మందికి పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉంది.
రాజకీయ జోక్యం తగదు : భూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
పోడు దరఖాస్తుల స్వీకరణ బాధ్యత ఎమ్మెల్యేలకు ఇస్తే నిజమైన పోడుదారులకు న్యాయం జరగదు. పోడు హక్కుపత్రాల విషయంలో అస్సలు రాజకీయ జోక్యం తగదు. అధికారులతో కూడిన కమిటీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నిజమైన పోడుదారులను గుర్తించే బాధ్యత అప్పగించాలి. ఆర్వోఎఫ్ఆర్ నిబంధనల ప్రకారం హక్కుపత్రాల జారీ ప్రకియ ఉండాలి. అంతేకానీ ఎమ్మెల్యేలకు దరఖాస్తుల స్వీకరణ బాధ్యత ఇస్తే మరో ఉద్యమం తప్పదు.