Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినెల 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించేలా ప్రణాళిక : పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ)కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ అప్పగింతలో ఎంత జాప్యం జరిగితే కార్పొరేషన్ పై అంత అర్థికభారం పడుతోందనీ, ఈ విషయాన్ని గుర్తించి అధికారులు మరింత క్రియశీలకంగా పనిచేయాలని కోరారు. 2019 - 20 యాసంగి, 2020-21 వానాకాలం సీఎంఆర్ పై పౌరసరఫరాల భవన్ లో సోమవారం కమిషనర్ అనిల్ కుమార్ తో కలిసి జిల్లా మేనేజర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భగా చైర్మెన్ మాట్లాడుతూ సీజన్లలో నిర్ణీత గడువులోగా రైసు మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోకపోవడానికి కొంత వరకు ఎఫ్ సీఐ కారణమైతే, పౌరసరఫరాల అధికారుల అలసత్వం కూడా కొంత ఉందని అన్నారు. ఎఫ్‌సీఐ ప్రాథమిక పరిశీలనతో ప్రస్తుతం మిల్లింగ్ నిలిచిపోయిందనీ, సమన్వయం చేసుకుని మిల్లింగ్ ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగిస్తేనే గడుపులోగా లక్ష్యాన్ని చేరుకుంటామనీ, ఇందు కోసం ఇప్పటి నుంచి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్, బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు పకడ్బంది చర్యలు తీసుకోవాలనీ, గోదాముల్లోని సీసీ కెమెరాలు వంద శాతం పని చేసేలా చర్యలు తీసుకోవాలనీ, అలాగే జీపీఎస్ లేకుండా బియ్యం రవాణా చేయడానికి వీల్లేదని తెలిపారు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావు, కన్సల్టెంట్ అశోక్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.