Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే పర్యవేక్షణను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీఎస్టీటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాదవ్ వెంకట్రారావు, జాడి రాజన్న సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల పనితీరు, పిల్లల ప్రగతిపై నెలకోసారి తనిఖీలు చేపట్టాలని కోరారు. విషయ నిపుణులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాకు పది పర్యవేక్షణ బృందాలు ఉండేలా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు, టై, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బూట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించాలని పేర్కొన్నారు.