Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓబీసీలను ఓటర్లుగా చూడొద్దు
- టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జనాభా లెక్కల సేకరణ సందర్భంగా బీసీ కులగణన కూడా చేయాల్సిందేనని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఓబీసీలను ఓటర్లుగా చూడొద్దనీ, వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులు అమలయ్యేలా చూడాలని కోరారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఓబీసీ సెల్ చైర్మెన్ నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల.లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఎంవీ రమణ, సీపీఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేశ్, ప్రొఫెసర్లు మురళి మనోహర్, తిరుమలి, విశ్వేశ్వర్, పీఓడబ్ల్యూ సంధ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీ కుల గణన చేసి వారికి రావాల్సిన ఆర్థిక, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలన్నారు. దేశంలో అన్ని కులాల లెక్కలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మోడీ వన్ నేషన్ వన్ సెన్సెక్స్‌ను ఎందుకు తీసురావడం లేదని ప్రశ్నించారు. జనాభా లెక్కలు తెలిస్తేనే బీసీ లకు రాజకీయ ప్రాతినిథ్యం పెరుగుతుందని ఆకాంక్షించారు. బీసీ జనగణన కోసం జరిగే పోరాటాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకెళ్తామని నొక్కిచెప్పారు.
సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయటపెట్టకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ మాట్లాడుతూ.. కులగణన జరిగితేనే బీసీల వాటా తేలుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా ఒక గొప్ప పరిణామన్నారు. తీర్మానం చేస్తే సరిపోదనీ అది అమలయ్యేదాకా పోరాటం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇవ్వాలనీ, రాష్ట్రపతికి లేఖ రాద్దామని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడుతూ.. కుల నిర్మూలన జరగాలంటే కులగణన జరగకుండా ఉండాలని అంబేద్కర్ అన్నట్టు తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అన్ని సామాజిక తరగతుల వాళ్లు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. సమాజంలో 50 శాత్మఉన్న జనాభాకు 0.5 శాతం కూడా బడ్జెట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతం జనాభాకు రిజర్వేషన్లు 34 శాతమే ఉన్నాయన్నారు. బీసీలు తిరగబడక ముందే రాజకీయ పక్షాలు వాళ్ల హక్కులను కాపాడాలని సూచించారు.