Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు చెందిన మూడు నెలల పెండింగ్ జీతాలకు సంబంధించి రూ.9.51 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి రోనాల్డ్ రోస్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు గత విద్యాసంవత్సరంలో పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంకా వారిని విధుల్లోకి తీసుకోలేదు.
గెస్ట్ లెక్చరర్ల సంఘం హర్షం
మూడు నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, టిగ్లా, టిప్స్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత విద్యాసంవత్సరంలో మూడు నెలల వేతన బకాయిల బడ్జెట్‌ను విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అతిధి అధ్యాపకుల జేఏసీ అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ కుంట కృతజ్ఞతలు తెలిపారు.