Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీసీ కార్పొరేషన్ ఎమ్డీ అలోక్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సంచార జీవితం గడుపుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ ఎమ్డీ అలోక్ కుమార్ తెలిపారు. సంచార జాతుల సంఘాల నాయకులతో సోమవారం హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార వృత్తికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుందని వివరించారు. సంచారజాతుల సంఘాల నాయకులు ఎమ్డీకి వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వత్తి కళాకారులుగా గుర్తించి తమకు పెన్షన్ ఇప్పించాలని వారు కోరారు. తమ పిల్లల చదువు కోసం గురుకుల పాఠశాలలో 5 నుంచి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్డీ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మందుల కుల సంక్షేమ సంఘం నేత యాదగిరి, తెలంగాణ రాష్ట్ర గంగిరెద్దుల నందీశ్వర సంఘం అధ్యక్షుడు వెంకట్, తెలంగాణ రాష్ట్ర సిక్లీఘర్ సిక్కు సమాజ్ అధ్యక్షుడు కె. జోగిందర్ సింగ్, తెలంగాణ పెద్దమ్మల కుల సంఘం అధ్యక్షుడు రాములు, తెలంగాణ వీరభద్రీయ సంఘం అధ్యక్షులు యాదయ్య, కార్యదర్శి ఎల్లేష్, అంజలి తెలంగాణ అనాధ పిల్లల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.