Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణం చేయించిన గవర్నర్
- హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ ఎం.ఎస్.ఆర్.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.