Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగుల్లో చైతన్యం నింపేందుకు ఈ నెల 6 నుంచి 14 వరకు బతుకమ్మ ఆట- పాట ఉత్సవాలను నిర్వహిస్తున్మామని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ సాయమ్మ అన్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ సౌజన్యంతో ఎన్పీఆర్డీ, తెలంగాణ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటా-పాట ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సాయమ్మ, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతికీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మని వివరించారు. కులమతాలకు అతీతంగా ప్రజలం దరు జరుపుకునే ఉత్సవం ఇదనీ, తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాలుగా ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. వికలాంగులు సమాజంలో వివక్షతకు గురవుతున్నారనీ, అలాంటి వారందర్నీ ఒక చోటకు చేర్చి ఆత్మస్థైర్యం నింపేందుకు వీలుగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో మహిళా వికలాంగులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు వారిలో మనోధైర్యాన్ని నింపుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, తెలంగాణ మహిళా వికలాంగుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ కె నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె శశికళ, లలిత, పద్మ, సత్యమ్మ, సోని, లావణ్య, రంగరెడ్డి, మల్లేష్, ఉమ తదితరులు పాల్గొన్నారు.