Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న సిబ్బంది
- తమ ఇంటిని కబ్జా చేస్తున్నారని ఆవేదన
- విచారణ చేసిన డీఆర్ఓ, ఏసీపీ
- న్యాయం చేస్తామని బాధితులకు హామీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఇంటిని కబ్జా చేసిన వారితో పోలీసులు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని మనస్తాపం చెందిన అత్తాకోడళ్లు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే సిబ్బంది వారిని వారించారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్ జరుగుతున్న క్రమంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలస ముద్రంలోని శ్రీనివాసకాలనీలో గతంలో ప్రభుత్వం శెట్టి పాపమ్మకు 60 గజాల ఇంటి స్థలం ఇచ్చింది. అక్కడ నిర్మించుకున్న ఇంట్లో పాపమ్మ కూతురు తిరుపతమ్మ తన కోడలు కావేరితో కలిసి నివాసముంటున్నారు. అయితే, వారికి తెలియకుండానే పాపమ్మ తమ్ముడు పీట్ల శ్రీను జంగిలి విజేందర్కు అమ్మాడు. దాంతో విజేందర్ ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా తిరుపతమ్మ అడ్డుకుంది. ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో తన ఇంటిని తనకు ఇప్పించాలని విజేందర్ గతంలో వరంగల్ ప్రెస్‌క్లబ్‌లోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన విషయం విదితమే. తాజాగా విజేందర్ నలుగురిని వెంట తీసుకెళ్లి.. తిరుపతమ్మ, కావేరిని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుపతమ్మ, కావేరి సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయకపోగా, జంగిలి విజేందర్‌తో కుమ్మక్కైన పోలీసులు వారిద్దరిపైనే కేసు పెట్టి లోపలేస్తామని బెదిరించారు. దాంతో కలెక్టరేట్‌కు వచ్చి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడున్న కార్యాలయ సిబ్బంది గమనించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు స్పందించి.. వరంగల్ డీఆర్ఓ వాసుచంద్ర, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డిని శ్రీనివాసకాలనీకి పంపించారు. వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.