Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు రూ. 140 కోట్లు స్వాధీనం
- కొనసాగుతున్న విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్‌కు చెందిన కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు గత నాలుగు రోజులుగా దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో హెటిరో డ్రగ్స్ సంస్థ యాజమాన్యం కోట్లాది రూపాయల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తున్నది. ముఖ్యంగా, వివిధ ప్రాంతాల్లో 30కి పైగా గదులను అద్దెకు తీసుకొని అందులో ఔషధాల బాక్సుల పేరిట వాటిలో డబ్బులను పెద్ద మొత్తంలో దాచినట్టు ఐటీ శాఖ దృష్టికి వచ్చినట్టు సమాచారం. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. కాగా, ఐటీ దృష్టిని మళ్లించడానికిగానూ ఔషధాల బాక్సుల పేరిట వాటిలో ఒక్కోదాంట్లో లక్షల రూపాయలను పెట్టి వాటిని తాము అద్దెకు తీసుకున్న వివిధ గదులలో దాచినట్టు ఐటీ దాడుల్లో బట్టబయలైంది. ఒక్కో బాక్సులో లక్షల రూపాయల్లో దాచిన ఈ డబ్బును గణించగా దాదాపు రూ. 140 కోట్లకు పైగా ఉన్నట్టు ఐటీ అధికారులు తేల్చినట్టు సమాచారం. దీనిపై దర్యాప్తును కొనసాగిస్తున్న అధికారులు హెరిటేజ్ డ్రగ్స్‌కు సంబంధించి వివిధ బ్యాంకులలో పెద్ద సంఖ్యలోనే లాకర్లు ఉన్నాయని కనిపెట్టినట్టు తెలుస్తున్నది. వాటిని కూడా తెరిస్తే అందులో నగదు, నగల రూపంలో కోట్ల రూపాయల్లోనే దాని విలువ ఉండే అవకాశం ఉన్నదని ఐటీ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలిసింది. కాగా, తాము జరుపుతున్న దాడులకు సంబంధించి ఐటీ శాఖ త్వరలో ఒక ప్రకటనను వెలువర్చే అవకాశం ఉన్నది.