Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 ఎకరాల్లో తాత్కాలికంగా ఏర్పాటు
- కోహెడలో 178 ఎకరాల్లో శాశ్వత మార్కెట్: వ్యవసాయ, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- విక్టోరియాహోం, బాటసింగారం లాజిస్టిక్ పార్కులను సందర్శించిన మంత్రులు
- వీఎంహోం పూర్వ విద్యార్థుల నిరసన
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్/సరూర్‌నగర్
బాటసింగారం లాజిస్టిక్ పార్కులోని 11 ఎకరాల్లో దసరా పండుగ రోజు పండ్ల మార్కెట్‌ను ప్రారంభిస్తామని వ్యవసాయ, గిడ్డంగులశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌ను తరలించి.. హయత్‌నగర్ మండల పరిధిలోని కోహెడలో 178 ఎకరాల్లో శాశ్వత మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బాటసింగారంలో ప్రారంభించే తాత్కాలిక మార్కెట్లో దసరా నుంచే కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్, రోడ్లు, కోల్డ్ స్టోరేజి వంటి సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పిస్తామని చెప్పారు. సోమవారం గడ్డి అన్నారం (కొత్తపేట) మార్కెట్ తరలింపు ప్రక్రియలో భాగంగా తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు కోసం సరూర్‌నగర్ విక్టోరియాహోం స్థలం, బాటసింగారం లాజిస్టిక్ పార్కును మంత్రి నిరంజన్‌రెడ్డి హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కోహెడలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని చెప్పారు. దసరా రోజు వ్యాపారులకు కేటాయించిన స్థలానికి లేఔట్ నిర్ధారిస్తామన్నారు. గడ్డిఅన్నారం నుంచి పండ్ల మార్కెట్ స్థలంలో అత్యున్నత ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ శంకుస్థాన చేస్తారన్నారు. బాట సింగారంలోని తాత్కాలిక మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఔటర్‌కు దగ్గరలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో బాటసింగారం ఉండటం వల్ల పండ్ల మార్కెట్ నిర్వహణకు ఇబ్బందులు ఉండవన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పండ్ల మార్కెట్ తాత్కాలిక నిర్వహణ కోసం విక్టోరియా హోం స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. కానీ అక్కడ స్థలం సరిపోదని, బాటసింగారంలో మార్కెట్ నిర్వహణకు ఎంఐఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమ్మతించారని తెలిపారు. మంత్రుల వెంట, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బలాలా, జాఫర్ హుస్సేన్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
నిరసన :
తాత్కాలిక పండ్ల మార్కెట్ స్థల పరిశీలన కోసం విక్టోరియా హోం వద్దకు వచ్చిన మంత్రులకు హోం పూర్వ విద్యార్థులు నిరసన తెలిపారు. అనాథ పిల్లల చదువుల నిలయం విక్టోరియా మెమోరియల్ హోం ట్రస్ట్ (వి.యం.హోం) భూముల్లో పండ్ల మార్కెట్ ప్రతిపాదనను విరమించుకోవాలని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భీమగాని మహేశ్ డిమాండ్ చేశారు. మంత్రుల రాకకు ముందే హోం వద్ద టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్, తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినరు కుమార్, పీడీఎస్‌యూ నాయకులు ఎం.పరశురాం మద్దతు తెలిపారు.