Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ, తెలంగాణ ముందు ప్రతిపాదించిన జీఆర్ఎంబీ
- అన్ని ప్రాజెక్టులనూ చేర్చాలని ఏపీ డిమాండ్
- చేర్చే ప్రసక్తే లేదన్న రాష్ట్ర ప్రభుత్వం
- పెద్దవాగుకే పరిమితం కానున్న బోర్డు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏపీ, తెలంగాణలోకి కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను పెద్దవాగుపై ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ప్రకటించింది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్ఎంబీ బోర్డు మీటింగ్ చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామలరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై చర్చించారు. పెద్ద వాగు ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకొనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 14 నుంచి కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్ అమల్లోకి రానుంది. పెద్దవాగుకే పరిమితం కావడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులనూ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమకు కేటాయించిన నీటినే వాడుకుంటున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులనూ చేర్చడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా ప్రాజెక్టులను దశలవారీగా తీసుకుందామని బోర్డు సూచించింది. ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదనీ, గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఒకవేళ చేర్చాలని బోర్డు భావిస్తే తెలంగాణ ఇరిగేషన్ శాఖకు లేఖ రాయాలని సూచించింది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయనిపుణులతో చర్చించాకే ముందుకు వెళ్తామని చెప్పింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు వాటిని ఖరారు చేస్తూ బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి రానుందని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. ఇరురాష్ట్రాల అధికారులు ఆపరేషన్లు వేరువేరుగా చేసుకోవాలని బోర్డు చెప్పిందన్నారు. పెద్దవాగు విషయాన్ని ప్రభుత్వానికి చెబుతామనీ, ఖర్చు విషయంలో స్పష్టత అడిగామని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడా ప్రాజెక్టులను టేకప్ చేసుకునే విధానంలేదనీ, తాము ఓకే అంటే బోర్డులోకి ప్రాజెక్టులువెళ్తాయని స్పష్టం చేశారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2వేల ఎకరాల ఆయకట్టు ఉందనీ, ఆంధ్రప్రదేశ్‌కు 13వేల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు వెళ్తుందని స్పష్టం చేశారు.