Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఎసీఎస్ ల్లో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి
- విజిలెన్స్, ఈడీ, సివిల్ సప్లయిస్ కమిషనర్‌కు అఖిలపక్ష నేతల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్దిపేట, జనగామ నియోజకవర్గాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), ఐకేపీ సెంటర్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు హైదరాబాద్‌లో సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులే కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. పీఏసీఎస్ చైర్మెన్ వంగ చంద్రారెడ్డి వ్యాపారస్తులతో కలిసి, మిల్లు యజమానులతో కుమ్మక్కై రూ. 3 కోట్ల 22 లక్షల పైచిలుకు అవినీతికి పాల్పడ్డారని వివరించారు. 65 మంది బినామీల పేర్లతో డబ్బు డిపాజిట్ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ట్రక్ షీట్లు సష్టించి రైతుల పేర కాకుండా టీఆర్ఎస్ నాయకుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు జమ చేశారన్నారు. చేర్యాల సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల, కడవేర్గు, రసూలాబాద్ సెంటర్లలో ప్రధానంగా అవినీతి జరిగిందనీ, తరుగు పేరుతో ఐదు కేజీల వరకు రైతుల బస్తాల నుంచి కోత విధించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా, బినామీ వ్యక్తుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఐకేపీ సెంటర్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని , కొమురవెల్లి ,చేర్యాల మద్దూరు,ధూల్మిట్ట మండలాల్లోని ఐకెపి సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేస్తే, అవినీతి- అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని సూచించారు.
ఒక్క కొమురవెల్లి మండలంలోనే ఐకేపీ 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 3 కేంద్రాలను చేర్యాల సొసైటీ నిర్వహించిందన్నారు. మిగతా 4 కేంద్రాలలో 2,356 మంది రైతుల నుంచి 1,05,72,440 కేజీల ధాన్యాన్ని 26,431 బస్తాల్లో ఐకేపీ సేకరించిందన్నారు. మర్రిముచ్చాల ధాన్యం కేంద్రం నుండి 14 ఖాళీ ట్రక్ షీట్లను చేర్యాలలోని రైస్ మిల్లుకు ఒక్కొక్కటి అమ్మకున్నట్టు విచారణలో తేలిందన్నారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో జరిగిన విధంగానే జనగామ, బచ్చన్నపేట, నర్మెట మండలాల్లో కూడా అవినీతి జరిగిందని రైతులు భావిస్తున్నారన్నారు. ఈ కుంభకోణంలో కేసు నమోదైన 19 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా నలుగురిని మాత్రమే రిమాండ్‌కు పంపి, మిగతా వారిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. వీటిపై పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మార్కెట్ చైర్మెన్ పుర్మ ఆగం రెడ్డి, మాజీ జడ్ పీటీసీ కొమ్ము నర్సింగ్ రావు, కౌన్సిలర్ చెవిటి లింగం, అంకుగారి శశిధర్ రెడ్డి, బుట్టి భిక్షపతి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నాయకులు అందె బీరన్న, అందె అశోక్, సీపీఐ నాయకులు రాచకొండ నాగరాజు , టీడీపీ నాయకులు ఒగ్గు రాజు పాటు ఇతర పార్టీల నాయకులు ప్రసాద్, భీమయ్య తదితరులు ఉన్నారు.