Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత కలిగిన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలి
- రాష్ట్రంలో 20 లక్షల మందికి సొంత గూడు కరువు
- 2016లో సమగ్ర సర్వేలో తేటతెల్లం
- వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు
- రంగారెడ్డిలో నిరసన దీక్షలు ప్రారంభం
- జిల్లాల్లో లఖింపూర్ ఘటనపై ర్యాలీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పేదలకు ఇవ్వాల్సిన రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ నిర్మాణాలను అమ్మాలనుకుంటే సహించేది లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చేపట్టిన దీక్షలను వ్యాకాస జిల్లా కార్యదర్శి కందుకూరు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకు 3 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ 2016లో సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు సొంత గూడు లేకుండా ఉన్నాయని ప్రభుత్వమే గుర్తించిందన్నారు. వారందరికీ సొంత గూడు నిర్మించి ఇస్తామని.. ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. 2017 నుంచి 2019 వరకు ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకపోయినా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయిందని చెబుతున్న ప్రభుత్వం గడిచిన మూడేండ్లలో ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. ప్రకటనలకే పరిమితం అవుతుందని, ఆచరణలో విఫలమవుతోందని విమర్శించారు. ఎన్నికల అవసరాలు తీర్చుకున్నాక.. హామీలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలు లేని వారికి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల 50 వేల సహాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థలాలు ఉన్న వారికి మాత్రం 5 లక్షల 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ, గృహకల్ప భవనాలు శిథిóలావస్థకు చేరుకున్నాయన్నారు. వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా కార్యదర్శి కందుకూరు జగన్, సహాయ కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యక్షులు జంగయ్య, నాయకులు వెంకటేష్, ప్రభు, గిరి, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5.50లక్షలు ఇవ్వాలని కోరుతూ వనపర్తి జిల్లా అంజనగిరి గ్రామంలో వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, ఆంజనేయులు గ్రామ పంచాయతి కార్యాలయంలో గ్రామ కార్యదర్శికి వినపతిపత్రం అందజేవారు. మదనాపురం, వీపన గండ్ల మండలాల్లోనూ వినతిపత్రాలు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంట మండలంలోని లాల్కోట గ్రామంలో వ్యకాస జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
నిరసన ర్యాలీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఘటనకు నిరసనగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో, సీఐటీయూ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, పాలకుర్తి, తదితర పలు మండలాల్లో నిరసన తెలిపారు.