Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరసరఫరాల శాఖకు ఇచ్చామంటున్న కార్మిక శాఖ
- ఎలాంటి నిధులూ రాలేదంటున్న పౌరసరఫరాల శాఖ
- బీఓసీడబ్ల్యూ బోర్డు నిధులు ఏమైనట్టు?
- వెల్ఫేర్ బోర్డుకు వెంటనే జమచేయాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'కోవిడ్ సమయంలో నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 రూపంలో రూ.258,03,84,051 అందజేశాం. మిగిలిన డబ్బు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సి ఉంది' అని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించింది. కానీ పౌరసరఫరాల శాఖ మాత్రం అందుకు విరుద్ధంగా చెబుతోంది. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు(ఎన్ఎఫ్ఎస్ఏ) సెక్షన్‌కు ఎలాంటి నిధులూ రాలేదని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. ఈ రెండు శాఖల వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నిర్మాణ రంగంలోని బిల్డర్లు, డెవలపర్స్ నుంచి 1 శాతం చొప్పున వసూలు చేసిన రూ.1005 కోట్ల నిధులపై గందరగోళం నెలకొంది. సెస్ నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు దారి మళ్లించారు. కోవిడ్ సమయంలో రూ.258 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన నిధులు ఏమయ్యాయి? అనే చర్చ జరుగుతోంది.
కోవిడ్ సమయంలో
బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు.. సెస్ ద్వారా రూ.1005కోట్లు వసూలు చేసింది. ఈ నిధులు కార్మికుల సంక్షేమంతోపాటు వాళ్ల పిల్లల సంక్షేమానికి ఖర్చు చేయాలి. కోవిడ్ సమయంలో రాష్ట్రంలోని 90.49 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేశారు. దీంతోపాటు కుటుంబానికి రూ.1500 చొప్పున బదిలీ చేశారు. వలస కార్మికుల కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున కార్మిక శాఖ ద్వారా నిర్ణయించి పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సలహా మండలి తీర్మానం లేకుండానే నిధులను బదిలీ చేశారని, ఖర్చు విషయంలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించిందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఆర్ధికశాఖ ఆదేశాలు
కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బం దులు పడిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు పౌరసరఫరాల శాఖ నుంచి ఉచిత బియ్యంతోపాటు నగదు సాయం చేసింది. అందుకు సంబంధించి రూ.334.94కోట్లను పౌరసరఫరాల శాఖకు రీయిం బర్స్ చేయాలని లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ కార్యదర్శికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లెటర్‌రాశారు. దీంతో పాటు భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయ డానికి మరో రూ.699.88 కోట్లు అడ్వాన్స్‌గా జనరల్ అండ్ అదర్ రెవెన్యూ ఫండ్స్(8121), డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(122), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్‌హెచ్01), కాంట్రీబూషన్ టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(001) ఖాతాలకు జమ చేయాలని పేర్కొన్నారు.
లేఖల యుద్ధం..
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లేఖతో.. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన రూ.1005 కోట్లను కార్మిక శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు బదిలీ చేశారు. కానీ సదరు పౌరసరఫరాల శాఖ మాత్రం నిధులెక్కడివని అంటోంది. అయితే, ఈ నిధులు ఎక్క డికి వెళ్లాయి? ఎవరు ఖర్చుచేశారు? మిగిలిన నిధులు ఎవరిదగ్గర ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమా ధానం లేదు. తమ నిధులను తిరిగి చెల్లించాలని పౌరసరఫరాల శాఖకు కార్మిక శాఖ అధికారులు ఐదు కు పైగా లేఖలు రాసినట్టు సమాచారం. ఈ విష యాన్ని అధికారులు బయటికి పొక్కనీయడం లేదు.
వెల్ఫేర్ బోర్డుకు వెంటనే జమ చేయాలి : సీపీఐ(ఎం)
అక్రమంగా తరలించిన రూ.1005కోట్లను తిరిగి నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డుకు వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గోల్కొండ క్రాస్‌రోడ్డులోని పార్టీ కార్యాలయం లో కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. లేబర్ సెస్ చెల్లింపులో వందల కోట్ల ఎగవే తలు, భారీ అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. శాఖ పని తీరుపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిధుల విషయంలో కార్మికశాఖ, పౌరసరఫరాల శాఖ తీరు శోచనీయంగా ఉందన్నారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.