Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను బానిసలుగా మార్చేందుకు బీజేపీ కుట్ర
- దేశంలో శాంతిభద్రతలు క్షీణిించాయి
- మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే ప్రజలకు స్వేచ్ఛ
- కాంగ్రెస్ మౌన దీక్షలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాగు చట్టాలతో రైతులను బానిసలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రధాని మోడీ స్పందించడంలేదని విమర్శించారు. దేశంలో శాంతిభద్రతలు క్ష్షీణించాయనీ, అటు మోడీ, ఇటు కేసీఆర్‌ను బొందపెడితేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మౌనదీక్ష నిర్వహించారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దీక్ష అనంతరం రేవంత్ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 'దేశ ప్రజల మన్ కీ బాత్' విను మోడీ అని హితవు పలికారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. లఖీంపూర్ ఘటనపై మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాగు చట్టాల ప్రభావం దేశంలోని ప్రజలపై ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలతో కార్పొరేట్లకు లబ్దిచేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్టు చెప్పారనీ, ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు చలిజ్వరం పట్టుకుందని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారని ఆరోపించారు. మోడీ, అమిత్‌షా రైతుల హత్యలను ఖండించి, జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఆ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడాలనికోరారు. రైతులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడికి, కేంద్రానికి బుద్ధిచెప్పే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. రైతులను చంపైనా వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దీనిపై మౌనంగా ఉన్న కేసీఆర్ వైఖరిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రచారకమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏ మహేశ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ,వంశీచంద్‌రెడ్డి, సునీతారావు, ఫిరోజ్‌ఖాన్, రోహిన్‌రెడ్డి, మానవతారారు, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు ఉన్నారు.