Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో కేజీ రూ.800... దక్కుతున్నది రూ.350నే
- మద్దతు ధర కరువు... దోపిడీ తీవ్రం
- సబ్సిడీలను తగ్గిస్తున్న సర్కారు
- సాగుకు దూరమవుతున్న రైతులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ సర్కారు తగినంత శ్రద్ధ చూపడంలేదు. రైతులకు సరైన ప్రోత్సహమివ్వ కపోవడంతో అన్నదాతలు పట్టుసాగుకు దూరమవుతున్నారు. ఆర్థికభా రాన్ని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టనష్టాలకొర్చి పండించిన రైతుకు సరైన మద్దతు ధర దక్కడం లేదు. ఆ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుబంధు పథకం మినహా వారికి ఎలాంటి సబ్సిడీలు అందడం లేదు.వారిని (సెరికల్చర్) గాలికొదిలేసింది. రాష్ట్రంలో సుమారు 10వేల మంది రైతులు మల్బరీ తోటలు వేసి, తద్వారా పట్టు పురుగులను పెంచుతున్నారు. ఈ క్రమంలో సాగులో వస్తున్న ఇబ్బందులు, కష్టాలను తట్టుకోలేక సుమారు 3వేల మంది రైతులు సాగుకు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లరూపాయలు ఖర్చుపెట్టి పాలీహౌజ్, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. విత్తనాలకు, డ్రిప్పుకు, షెడ్ల నిర్మాణం కోసం సబ్సిడీలు ఇస్తున్నది. కానీ పట్టు రైతులను మాత్రం విస్మరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కిలో పట్టుకు రూ 75 ప్రోత్సహం, షెడ్డు నిర్మాణానికి రూ 1.03 లక్షలు సబ్సిడీ ఇవ్వాలి. ఇవేవీ రైతుకు అందడంలేదు. గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. దీంతోపాటు జాతీయ ఉపాధిహామీ చట్టం (ఎన్ఆర్జీఎస్) కింద షెడ్ల నిర్మాణానికి రూ 3 లక్షల విలువైన పనులను ప్రభుత్వం చేయించాలి. వీటన్నింటితో కలిపి ఒక షెడ్ నిర్మాణానికి దాదాపు రూ 14 లక్షల ఖర్చు అవుతున్నది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సామాన్య రైతు మల్బరీ సాగు చేయగలడా? అనేది ప్రశ్న. ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సహం లేకపోవడంతో రైతులు ఈ పంటపై అనాసక్తి చూపుతున్నారు.
రూ 75 ఇన్సెంటివ్ ఎక్కడీ
గతంలో పట్టు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కిలోకు రూ 75 బోనస్రూపంలో ఇచ్చేది. కానీ 2018 నుంచి ఇప్పటివరకు ఈ రంగానికి రూపాయి కూడా చెల్లించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హిందూపూర్‌లో కిలోపట్టు ధర రూ.800-900 పలుకున్నది. కర్ణాటక ప్రభుత్వం రూ 600 చెల్లిస్తున్నది. కానీ మన రాష్ట్రంలో రూ 350 నుంచి రూ 450 మాత్రమే కొనుగోలు చేస్తున్నది. కానీ పట్టు పరిశ్రమ అధికారులు మాత్రం దానికి వంకలు పెడుతూ అతితక్కువ ధరకు కొంటున్నారు. రైతులను దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను కూడా అధికారులు అమలు చేయకుండా ప్రయివేటు వ్యాపారులతో కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు ఎంతో నాణ్యమైంది. ఇతర దేశాల్లోనూ ప్రసిద్ధి గాంచింది. అయినా మన రైతులను ప్రభుత్వమే మోసం చేస్తున్నది.
సలహాలు...సూచనలేవి?
ఆయిల్‌పామ్, ఉద్యానవన పంట సాగు కోసం కోట్లు ఖర్చు పెట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వానికి ...పట్టు రైతుల సాధకబాధకాలు మాత్రం పట్టడం లేదు. పట్టుకు సంబంధించి ఒక్కొక్క మండలానికి ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉండాలి. ఆయా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. వ్యవసాయ శాఖ అధికారులను సెరికల్చర్‌కు డిప్యూటేషన్ మీద పంపిస్తున్నారు. వారికి సరైన పట్టులేకపోవడంతో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. దీంతో వేల మంది రైతులు పట్టు సాగుకుదూరవుతున్నారు. ఆ స్థానంలో పత్తి సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కూలీ ధరలు, పట్టు పురుగుల కోసం మందులు ధరలు, పౌడర్ల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. జనగాం, హైదరాబాద్‌లోని తిరుమలగిరి కేంద్రాల్లో పట్టు గుళ్ల విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, వికరాబాద్, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 12 క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసింది. అయితే సరైన దృష్టి, దృక్ఫథం ప్రభుత్వానికి లేకపోవడంతో ఈ రైతులు ఇబ్బందిపడుతున్నారు.
ధరలు తగ్గిస్తున్నారు
- ఎం శ్రీనివాసగౌడ్ పట్టు రైతు, సిద్దిపేట జిల్లా
అధికారులు, డీలర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. వేలంపాట పేరుతో తీవ్రంగా మెసం చేస్తున్నారు. కిలోకు మద్దతు ధర రూ 400 ఉండాలి. బయటి రాష్ట్రాల్లో రూ 600 ధర ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ 250-రూ 350 లోపే ఇస్తున్నది. రైతుల వద్ద తక్కువకు కొని కార్పొరేట్ కంపెనీలకు అధిక ధరకు అమ్ముకుంటున్నారు.
కిలో రూ 500కు కొనాలి
- మూడ్‌శోభన్, రాష్ట్ర సహాయకార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
కిలో పట్టు రూ 500 కొనాలి. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలి. ఇప్పటికే ఒక్కో రైతుకు 2.50 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దృష్ట్యా ఆ నియోజకవర్గంలోనే ఇన్సెంటివ్ ఇచ్చారు. అది ఏమిపద్ధతి? రాష్ట్రంలోని రైతులందరికీ ఇవ్వాలి. మార్కెట్లను ఇతర ప్రాంతాలకు విస్తరించాలి.